Duleep Trophy Highlights: సంజూ శాంసన్ సూపర్ సెంచరీ, కీలక ఇన్నింగ్స్‌తో తన ఫామ్ అందుకున్నాడా?
Duleep Trophy News | దులీప్ ట్రోఫీలో భాగంగా సంజూ శాంసన్ సెంచరీ బాదాడు. వంద లోపు బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్ తో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 11వ శతకం నమోదు చేశాడు టీమిండియా బ్యాటర్ శాంసన్.
Sanju Samson hits his 11th First Class century | అనంతపురం జిల్లా : టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ సంజుశాంసన్ తనదైన శైలి ధనాధన్ బ్యాటింగ్ తో సూపర్ సెంచరీ సాధించాడు. అనంతపురం స్పోర్ట్స్ విలేజ్ లో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మూడవ రౌండ్ మ్యాచ్ లో ఇండియా-బీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డీ తరఫున సంజూ శాంసన్ బరిలోకి దిగాడు. వికెట్ కీపర్ సంజుశాంసన్ మొదటి మ్యాచ్ లో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన సెంచరీని సాధించాడు. 104 స్ట్రైక్ రెట్ తో 101 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు,3 భారీ సిర్ల సహాయం తో 106 పరుగులు సాధించాడు.
సెంచరీతో తన ఫామ్ అందుకున్నాడా..?
గత కొంతకాలంగా వరస వైఫల్యాలతో టీంలో చోటు కోసం కష్టపడుతున్న కేరళ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఈ సెంచరీ ఊరట నిచ్చింది. శ్రీలంకతో జరిగిన సిరీస్ లోను వరుస వైఫల్యాలతో విమర్శల పాలయ్యాడు. మరోవైపు టీంలో అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని సరిగా ఉపయోగించుకోలేదన్న విమర్శలు కూడా గట్టిగా వినిపించాయి. దీంతో దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ లో ఆడేందుకు అనంతపురంకి చేరుకున్న సంజుశాంసన్ కి మొదటి మ్యాచ్ లో చోటు దక్కనప్పటికీ రెండవ మ్యాచ్లో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ను తప్పించి సంజుశాంసన్ కు అవకాశం కల్పించారు. ఆ మ్యాచ్ లో కూడా సంజు విఫలం కావడంతో మరొకసారి విమర్శల పాలయ్యాడు. మూడో రౌండ్ మ్యాచ్ లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. కేవలం 101 బంతుల్లో 106 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. బంగ్లాదేశ్ రెండు టెస్టు మ్యాచ్ ల అనంతరం మూడు టి20 లు భారత్ ఆడాల్సి ఉంది. ఈ పర్ఫామెన్స్ తో సంజుశాంసన్ కు బాంగ్లాదేశ్ తో జరిగే టి20 సిరీస్ కు ఎంపిక అయ్యే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.