Sachin Tendulakular: గురువు విగ్రహం సాక్షిగా కలుసుకున్న సచిన్-కాంబ్లీ
Vinod Kambli And Sachin Tendulkar: దివంగత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ముంబైలో కలుసుకున్నారు.
ఓనమాలు దిద్దిన దగ్గరే గురువు స్మారకం
సచిన్ టెండూల్కర్ కు ముంబైలోని శివాజీ పార్కుకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడే సచిన్.. తన గురువు రమాకాంత్ అచ్రేకర్ వద్ద క్రికెట్ లో ఓనమాలు నేర్చుకున్నాడు. గురువు మాట జవదాటకుండా కఠోరంగా శ్రమించాడు. అదే ప్రాంతంలో కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారకాన్ని సచిన్ ఆవిష్కరించారు. సచిన్ కోచ్ అయిన రమాకాంత్ అచ్రేకర్ జయంతిని పురస్కరించుకునిశివాజీ పార్కులో ఆయన స్మారకాన్ని ఆవిష్కరించారు. శివాజీ పార్క్ అయిదో నెంబర్ గేటు సమీపంలోనే ఏర్పాటు చేసిన తన గురువు రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నాన్ని సచిన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా పాల్గొన్నారు. తన గురువు ఎప్పుడూ తనకు క్రికెట్ ను గౌరవించమని చెప్పేవారని.. క్రికెట్ కిట్ ను ఎప్పుడూ గౌరవించాలని చెప్పేవారని సచిన్ గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని తాను ప్రస్తుత క్రికెటర్లకు కూడా చెప్తుంటానని... క్రికెట్ కిట్ ను ఎక్కడపడితే అక్కడ పడేయొద్దని... అవుటైనా.. ఓడిపోయినా.. ఆ కోపాన్ని కిట్ పై చూపొద్దని చెప్తుంటానని సచిన్ అన్నారు. తాను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే క్రికెట్ కిట్టే కారణమని సచిన్ అన్నారు. అచ్రేకర్ సార్ తనను ఎప్పుడు బాగా ఆడవని అనలేదని... కానీ ఆయన కళ్లలోనే తాను ఎలా ఆడానో తెలిసిపోయేదని సచిన్ అన్నాడు. ఆ మహనీయుడి స్మారకాన్ని ఆవిష్కరించి, నివాళి అర్పించే అవకాశం రావడం తన అదృష్టమని సచిన్ అన్నాడు. ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైన రోజని సచిన్ వెల్లడించాడు.
#WATCH | Maharashtra: Former Indian Cricketer Sachin Tendulkar and MNS chief Raj Thackeray unveiled cricket coach Ramakant Achrekar's memorial in Mumbai.
— ANI (@ANI) December 3, 2024
(Source: Shivaji Park Gymkhana) pic.twitter.com/8PEZy5QsDZ
పాత స్నేహితులు మళ్లీ కలిశారు..
రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ(Vinod Kambli) మళ్లీ కలిశారు. కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఇద్దరు స్నేహితులు మళ్లీ ఏకమయ్యారు. వీరిద్దరూ అచ్రేకర్ శిష్యులు. ఈ కార్యక్రమంలో టెండూల్కర్... కాంబ్లీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అచ్రేకర్ విద్యార్థులు, పరాస్ మాంబ్రే, ప్రవీణ్ ఆమ్రే, బల్వీందర్ సింగ్ సంధు, సంజయ్ బంగర్, సమీర్ డిఘే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు కనిపిస్తోంది. కాంబ్లీ 2022లో తన ఆందోళనకర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాడు. తన కుటుంబం కేవలం బీసీసీఐ అందించే పెన్షన్‌పై మాత్రమే ఆధారపడి ఉందని వెల్లడించాడు. పాఠశాల క్రికెట్‌లో సచిన్-కాంబ్లీ 664 పరుగుల భారీ భాగస్వామ్యంతో రికార్డు నెలకొల్పారు. కాంబ్లీ, టెండూల్కర్ భారత్ కు ఆడాలనే కలను సాకారం చేసుకుని.... అచ్రేకర్ గొప్ప శిష్యులుగా ఎదిగారు.
#WATCH | Maharashtra: Former Indian Cricketer Sachin Tendulkar met former cricketer Vinod Kambli during an event in Mumbai.
— ANI (@ANI) December 3, 2024
(Source: Shivaji Park Gymkhana/ANI) pic.twitter.com/JiyBk5HMTB
ద్రోణాచార్య అచ్రేకర్
అచ్రేకర్ అందించిన సేవలకు గుర్తింపుగా 1990లో ఆయనను ప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య అవార్డుతో సత్కరించారు. 2010లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 2019 జనవరిలో అచ్రేకర్ మరణించారు.