SA vs AUS: సఫారీ గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన కంగారూలు - సిరీస్ క్లీన్ స్వీప్
దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. తొలిసారిగా సఫారీలపై కంగారూలు టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశారు.
SA vs AUS: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. టీ20 ఫార్మాట్‌లో కొత్త కెప్టెన్ (మిచెల్ మార్ష్) సారథ్యంలో ఆ జట్టు సఫారీలను మూడు మ్యాచ్‌లలోనూ ఓడించి సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి ఈ ఫార్మాట్‌లో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం డర్బన్ లోని కింగ్స్ మీడ్ వేదికగా ముగిసిన మూడో టీ20లో ఆసీస్.. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లోలనే ఛేదించి సిరీస్‌ను 3-0తో దక్కించుకుంది.
తొలి రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన దక్షిణాఫ్రికా మూడో మ్యాచ్‌లో మాత్రం కంగారూల బౌలింగ్‌ను కంగారెత్తించింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (30 బంతుల్లో 42, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ (23 బంతుల్లో 41, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) , డొనొవన్ ఫెరీరా (21 బంతుల్లో 48, 1 ఫోర్, 5 సిక్సర్లు)కు తోడు వికెట్ కీపర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 25, 1 ఫోర్, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. స్టోయినిస్ రెండు వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియాను నిలువరించే క్రమంలో తొలి ఓవర్ తొలి బంతికే సఫారీలకు మంచి అవకాశం దక్కింది. కెప్టెన్ మార్క్‌రమ్ వేసిన ఓవర్‌లో ఆసీస్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ డకౌట్ అయ్యాడు. కానీ మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (48 బంతుల్లో 91, 8 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ మిచెల్ మార్ష్ (15)తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మార్ష్ ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినా ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ఆ తర్వాత వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (22 బంతుల్లో 42, 1 ఫోర్, 4 సిక్సర్లు) సఫారీ బౌలర్ల భరతంపట్టారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 85 పరుగులు జోడించి మ్యాచ్‌ను పూర్తిగా ఆసీస్ నియంత్రణలోకి తెచ్చేశారు.
Undefeated in the Mitch Marsh captaincy era 🙌
— Cricket Australia (@CricketAus) September 3, 2023
The skipper is named Player of the Series, as our men's T20 squad do their country proud with a 3-0 series win over South Africa #SAvAUS pic.twitter.com/NwpIk0CGmC
ఇంగ్లిస్ నిష్క్రమించినా మార్కస్ స్టోయినిస్ (21 బంతుల్లో 37, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తో కలిసి హెడ్ ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. సఫారీ బౌలర్లు అంతగా ప్రభావం చూపకపోవడంతో ఈ మ్యాచ్ కూడా ఆ జట్టు చేతుల నుంచి చేజారింది.
టీ20 సిరీస్ ముగియడంతో ఈనెల ఏడు నుంచి ఇరు జట్లూ వన్డే సిరీస్ ఆడనున్నాయి. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వచ్చే గురువారం జరుగనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial