Ind Vs Eng 4Th T20 Update: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ ఫినిషర్ తిరిగొచ్చాడు.. ఇక దబిడి దిబిడే..
నడుం నొప్పితో 2,3 టీ20లకు దూరమైన రింకూ.. నాలుగో టీ20కి పూర్తి ఫిట్ గా మారినట్లు జట్టు కోచ్ టెన్ డస్కటే తెలిపాడు. గత 2 మ్యాచ్ ల్లో ఫినిషర్లు లేక ఇబ్బంది పడిన భారత్ కి రింకూ రాక మరింత బలాన్ని ఇస్తుంది.

Rinku Singh News: ఇంగ్లాండ్ తో మూడో టీ20 ఓడిపోయి నిరాశలో ఉన్న టీమిండియాకు గుడ్ న్యూస్. ఫినిషర్ రింకూ సింగ్ ఫిట్ గా మారి, నాలుగో టీ20కి సిద్దమయ్యాడు. నడుం నొప్పితో రెండు, మూడు టీ20లకు దూరమైన రింకూ.. నాలుగో టీ20కి పూర్తి ఫిట్ గా మారినట్లు జట్టు సహాయక కోచ్ టెన్ డస్కటే తెలిపాడు. గత రెండు మ్యాచ్ ల్లో ఫినిషర్లు లేక ఇబ్బంది పడిన భారత జట్టుకు రింకూ సింగ్ రాక మరింత బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఐదు టీ20ల సిరీస్ లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలి టీ20ని ఏడు వికెట్లతో నెగ్గిన భారత్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అజేయ ఫిఫ్టీతో రెండో టీ20లో రెండు వికెట్లతో నెగ్గి ఊఫిరి పీల్చుకుంది. అయితే అనూహ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బ తినడంతో 26 పరుగులతో మూడో టీ20లో టీమిండియా ఓడిపోయింది. దీంతో శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఎలాగైనా నెగ్గి, సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
ఎవరి ప్లేసులో..?
నిజానికి ఈ సిరీస్ కు ఇద్దరు భారత ప్లేయర్లు దూరమయ్యారు. రింకూ సింగ్ తో పాటు తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా దూరమయ్యాడు. అయితే రింకూ తిరిగి రావడంతో ప్రస్తుతం జట్టు కూర్పుపై ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రెండు మూడు మ్యాచ్ ల్లో విఫలమైన ధ్రువ్ జురెల్ స్థానంలో రింకూ బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. రెండో టీ20లో నెం.5లో బ్యాటింగ్ చేసి విఫలమైన జురెల్ కు మూడో టీ20లో ఏకంగా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. అయినప్పటికీ తన మార్కును వేయలేకపోయాడు. దీంతో అతనిపై వేటు ఖాయమని తెలుస్తోంది. రెండు మ్యాచ్ లు కలిపి అతను ఆరు పరుగులే సాధించాడు. ఇక మరో ఇద్దరు ఆటగాళ్ల నుంచి కూడా రింకూకు పోటీ నెలకొంది.
ఆల్ రౌండర్ల నుంచి గట్టి పోటీ..
చివర్లో మెరుపులు మెరిపించడంతోపాటు బంతితోనూ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగల ఆటగాడి కోసం టీమ్ మేనేజ్మెంట్ చూసినట్లయితే రింకూకు కష్టాలు తప్పవు. ఒకవేళ అదే నిజమైతే రింకూ పెవిలియన్ లో కూర్చోక తప్పదు. ఈ స్థానంలో శివమ్ దూబే, రమణ్ దీప్ సింగ్ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఇద్దరు భారీ హిట్టర్లే అయినా, రమణ్ తో పోలిస్తే దూబేకు అనుభవం ఎక్కువ. దీంతో ఓటు అతనికే పడవచ్చు. మరోవైపు నలుగురు స్పిన్నర్లు వద్దనుకుంటే, విఫలమవుతున్న వాషింగ్టన్ సుందర్ స్థానంలో వీరిద్దరిలో ఒకరిని ఆడించవచ్చు. ఇద్దరూ పేస్ ఆల్ రౌండర్లే కావడం విశేషం. అప్పుడు రింకూను కూడా తుదిజట్టులో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడో టీ20లో గెలిచి జోరుమీదున్న ఇంగ్లాండ్ ఆటకట్టించాలని భారత్ భావిస్తోంది. పుణేలోనే ఆ జట్టును ఓడించి సిరీస్ పట్టేయాలని పట్టుదలగా ఉంది. ఇక సిరీస్ లో ఐదో మ్యాచ్ ముంబైలో జరగుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

