(Source: ECI/ABP News/ABP Majha)
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు , ఆసిస్‌పై అన్ని పరుగులు చేయటం తొలిసారట
Ruturaj Gaikwad: అయిదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను 4-1తో యువ భారత్ సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.
భారత పర్యటనను ఆస్ట్రేలియా ఓటమితో ముగించింది. నామామాత్రమైన అయిదో టీ ట్వంటీలోనూ పరాజయం పాలైంది. ఆసిస్ ఓటమితో అయిదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను 4-1తో యువ భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 154 పరుగులకే పరిమితమైంది. ఇప్పటికే అయిదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అక్షర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బిష్ణోయ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. అయితే ఈ సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. చివరి మ్యాచ్‌లో గైక్వాడ్ 10 పరుగులకే ఔటైనా మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబర్చాడు. ఈ సిరీస్‌లో మొత్తం 55.75 సగటుతో 223 పరుగులు చేసి సత్తా చాటాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాపై ఒక టీ 20 ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రుతురాజ్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2021లో మార్టిన్ గప్తిల్ ఐదు మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేశాడు. ఈ రికార్డును రుతురాజ్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తర్వాత ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు.
ఇదే సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ చెలరేగిపోయి సెంచరీ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. మొదట చినుకులా ప్రారంభమైన రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ తర్వాత తుపానులా మారింది. కేవలం 54 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో రుతురాజ్ శతకాన్ని బాదాడు. మొదట నిదానంగా ఆడిన రుతురాజ్ క్రీజులో కుదురుకున్నాక విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో స్కోరు బోర్డుకు జెట్ వేగాన్నిచ్చాడు. 15 ఓవర్ల తర్వాత దొరికిన బంతిని దొరికినట్టు బాదాడు. ఏ బౌలర్‌నూ వదలకుండా ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. మూడు సిక్స్‌లు, ఫోర్‌తో హర్డీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 25 పరుగులు రాబట్టిన రుతురాజ్.. మ్యాక్స్‌వెల్ వేసిన ఆఖరి ఓవర్లో రుతురాజ్ మరింతగా రెచ్చిపోయాడు. మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదడంతో మ్యాక్స్‌వెల్ ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. 32 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అతడు.. మరో 20 బంతుల్లోనే సెంచరీ సాధించాడంటేనే ఎంతగా విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 57 బంతుల్లో రుతురాజ్ 13 ఫోర్ లు, 7 సిక్స్ లతో 123 పరుగులు చేశాడు.
ఈక్రమంలో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు ఇదే ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రుత్‌రాజ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో క్రికెటర్‌గా గైక్వాడ్‌గానూ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 126 పరుగులు చేయగా... రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడు 123 పరుగులు చేశాడు.