Ravichandran Ashwin: హిమలయాలంత ఎత్తులో బుమ్రా, పొగడ్తలతో ముంచెత్తిన అశ్విన్
Ravichandran Ashwin: టీమిండియాలో కీలక బౌలర్‌గా మారిన బుమ్రాపై అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు.పేసర్ జస్ప్రీత్ బుమ్రా గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడని అతడికి తాను పెద్ద అభిమానినని అశ్విన్ అన్నాడు.
Ashwin lauds Bumrahs Himalayan feat: వైజాగ్ (Vizag)వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో తొమ్మిది వికెట్లతో సత్తా చాటిన టీమిండియా(Team India) పేసు గుర్రం జస్ర్పీత్ బుమ్రా(Jasprit Bumrah)... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్(ICC's Test bowlers rankings)లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి ఈ ఘనత అందుకున్నాడు. భారత్ నుంచి ఓ ఫాస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానం సాధించడం ఇదే మొదటిసారి. ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న నాలుగో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. బిషన్ సింగ్ బేడి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తర్వాత బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు. బుమ్రా మినహా మిగిలిన ముగ్గురు స్పిన్నర్లే కావడం గమనార్హం. బుమ్రా.. ప్యాట్ కమిన్స్, కాగిసో రబాడ, అశ్విన్‌లను అధిగమించి బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. అశ్విన్ 11 నెలల తర్వాత అగ్రస్థానం కోల్పోవాల్సి వచ్చింది. రెండు స్థానాలు కిందకు పడ్డ అతడు ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. రబాడ రెండో స్థానం దక్కించుకున్నాడు. టీమిండియాలో కీలక బౌలర్‌గా మారిన బుమ్రాపై అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు.
అశ్విన్ ఏమన్నాడంటే..?
పేసర్ జస్ప్రీత్ బుమ్రా గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడని.. అతడికి తాను పెద్ద అభిమానినని అశ్విన్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఇప్పటికే 14 వికెట్లతో అత్యధిక వికెట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడని గుర్తు చేశాడు. అంతేకాదు ర్యాంకుల్లో నంబర్‌వన్ టెస్టు బౌలర్‌గానూ నిలిచాడని.... హిమాలయాల ఎత్తంత ఘనత సాధించిన బుమ్రాకు తాను చాలా పెద్ద అభిమానని అశ్విన్ తెలిపాడు. తనలో ప్రతిభకు కొదవ లేదని తాజాగా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో శతకం ద్వారా శుభ్‌మన్ గిల్ రుజువు చేశాడని అన్న అశ్విన్ తెలిపాడు.
బుమ్రా ఆవేదన
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బౌలర్‌గా నిలిచిన అనంతరం బుమ్రా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టు వైరల్‌గా మారింది. మద్దతు వర్సెస్ శుభాకాంక్షలు అని అని రెండు ఫొటోలను కలిపి బుమ్రా పోస్టు చేశాడు. మద్దతు ఇచ్చేవాళ్లు తక్కువనే అర్థంలో స్టేడియంలో ఒక్కరే కూర్చున్న ఫొటోను ఉంచి... ఏదైనా సాధించిన తర్వాత శుభాకాంక్షలు చెప్పేవాళ్లు మాత్రం చాలా మంది ఉంటారనే కోణంలో స్టేడియం కిక్కిరిసిన ఫొటోను బుమ్రా షేర్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాను దున్నేస్తోంది. స్పిన్నర్‌కు అనుకూలమైన పిచ్‌పై జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు బుమ్రా కంటే తక్కువ బౌలింగ్ చేశారు. తొలి టెస్టులోనూ బుమ్రా దాదాపు 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్ నుంచి మహ్మద్ షమీ పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.