Ranji Trophy Semifinal: రసవత్తరంగా రంజీ సెమీస్‌లు, శార్దూల్, హిమాన్షు సెంచరీలు
Ranji Trophy semifinal : దేశవాళీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
Ranji Trophy semifinals: దేశవాళీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీట్రోఫీ (Rajni Trophy) సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. నాగ్‌పూర్ వేదికగా విదర్భ-మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న తొలి సెమీస్‌లో మధ్యప్రదేశ్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 170 పరుగులకే ఆలౌట్ అవగా మధ్యప్రదేశ్.. 252 పరుగులు చేసింది. హిమాన్షు మంత్రి (126) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. హిమాన్షు మినహా మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు. దీంతో ఆ జట్టుకు 82 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. విదర్భ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (3/40), యశ్ ఠాకూర్ (3/51), వాఖరే (2/68), సర్వటే (1/48) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 13 పరుగులు చేసింది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన మధ్యప్రదేశ్ పేసర్ అవేశ్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ విదర్భకు తొలి షాకిచ్చాడు. విదర్భ ఇంకా 69 పరుగులు వెనుకబడి ఉంది. విదర్భ బ్యాటర్లు దృవ్ షోరే (10), అక్షయ్ వాఖరే (1) క్రీజ్‌లో ఉన్నారు.
శార్దూల్ తొలి శతకం
ముంబై వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ముంబై ఆధిక్యత ప్రదర్శిస్తుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్ (109) మెరుపు శతకంతో విరుచుకుపడటంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. శార్దూల్ ఠాకూర్ (104 బంతుల్లో 109, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీకి తోడు పదో నెంబర్ ఆటగాడు తనుష్ కొటియాన్ (109 బంతుల్లో 74 నాటౌట్, 10 ఫోర్లు) చెలరేగడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ముంబైకి ఇప్పటికే 207 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై.. వంద ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. తనుష్ తో పాటు క్వార్టర్ ఫైనల్‌లో సెంచరీ చేసిన తుషార్ దేశ్‌పాండే (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సాయికిషోర్ (6/97) ముంబైను దెబ్బకొట్టాడు. తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్ల ధాటికి తమిళనాడు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత్ అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో విజయ్ శంకర్ 44, వాషింగ్టన్ సుందర్ 43 కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు.
నిరాశపరిచిన అయ్యర్
బీసీసీఐ కన్నెర్ర చేయడంతో దేశవాళీలో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీ (Ranji Trophy) 2023-24 సీజన్ సెకెండ్ సెమీఫైనల్లో ముంబై, తమిళనాడు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై తరపున బరిలోకి దిగిన అయ్యర్ (Shreyas Iyer) విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరి నిరాశ పరిచాడు. రెండో రోజు ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. 8 బంతుల్లో 3 రన్స్ చేశాడు. అనంతరం వారియర్ బౌలింగ్‌లో అతను కూడా క్లీన్ బౌల్డయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డయ్యాడు.