Ranji Trophy 2024: తగ్గేదే లే అంటున్న హైదరాబాద్, రంజీల్లో వరుసగా మూడో విక్టరీ
Ranji Trophy 2024:ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న హైదరాబాద్ జట్టు.. మూడో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది
దేశవాళి ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy) లో హైదరాబాద్(Team Hyderabad) జట్టు మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న హైదరాబాద్ జట్టు.. మూడో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్ విజయం సాధించి సత్తా చాటింది. అఫ్గాన్(Afghanistan)తో టీ 20 సిరీస్ సందర్భంగా హైదరాబాద్ జట్టును వీడిన తిలక్ వర్మ.(Tilak Varma).. తిరిగి జట్టులో చేరి సంచలన బ్యాటింగ్ చేయడంతో సిక్కింపై విజయం దక్కింది..
మ్యాచ్ సాగిందిలా..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సిక్కిం బ్యాటింగ్‌కు దిగింది. ఇదే ఎంత తప్పుడు నిర్ణయమో సిక్కిం జట్టుకు వెంటనే తెలిసొచ్చింది. హైదరాబాద్ బౌలర్లు త్యాగరాజన్ ఆరు వికెట్లు, సీవీ మిలింద్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో సిక్కిం కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయింది. వీరిద్దరి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సిక్కిం జట్టు తీవ్రంగా కష్టపడింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ 137 పరుగులతో అద్భుత శతకం సాధించాడు. ఇప్పటికే భారీ శతకంతో మంచి ఫామ్‌లో ఉన్న గహ్లోత్ రాహుల్ సింగ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 83 పరుగులతో రాణించాడు. తన్మయ్ అగర్వాల్- గహ్లోత్ రాహుల్ సింగ్ హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చింది. వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్ రాయుడు సైతం 75 పరుగులతో రాణించాడు. టీమిండియా యువ సంచలనం, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ తన అద్బుత ఫామ్‌ను కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 111 బంతులు ఎదుర్కొన్న వర్మ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలతో తిలక్ వర్మ అదరగొట్టాడు. తిలక్ వర్మ మెరుపు సెంచరీతో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌ను నాలుగు వికెట్ల నష్టానికి 463 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే కథ
384 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సిక్కిం 186 పరుగులకు ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ ఈ ఏడాది రంజీ సీజన్‌లో మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 186 పరుగులకు ఆలౌట్ అయిన సిక్కిం... ఇన్నింగ్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. హైదరాబాద్ బౌలర్లు విజృంభిచడంతో సిక్కింపై ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది.
మూడు మ్యాచుల్లోనూ ఇన్నింగ్స్ విజయాలే
రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనాగాలాండ్‌ను రెండు రోజుల్లోనే హైదరాబాద్ మట్టికరిపించింది. ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మేఘాలయ(Meghalaya) పై ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి హైదరాబాద్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. రెండురోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో.. మేఘాలయాను హైదరాబాద్ జట్టు చిత్తు చేసింది. సిక్కింతో జరిగిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్ విజయం సాధించి సత్తా చాటింది.