ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ నుంచి తరలిస్తారా? - పీసీబీ ధోరణిపై ఐసీసీ గుర్రు..
PCB: ఛాంపియన్స్ ట్రోఫీ హక్కులు పాక్‌కు ఇచ్చిన ఐసీసీకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. స్టేడియంల నిర్మాణ పనులను ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి. వచ్చే వారంలో దీనిపై స్పష్టత రానుంది.
PCB Vs ICC: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ రోజుల్లోకి వచ్చేసింది. ఇంకా 40 రోజుల్లో టోర్నీ ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌లో వచ్చే నెల 19 నుంచి ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆతిథ్య పాకిస్తాన్ తలపడనుంది. కరాచీ, రావాల్పిండి, లాహోర్ వేదికల్లో ఈ టోర్నీ జరుగుతుంది. అయితే టోర్నీకి సమయం దగ్గర పడుతున్నా, ఇంకా స్టేడియాల నిర్మాణం పూర్తి కాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన వేదికలైన లాహోర్లోని గడాఫీ స్టేడియం, కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియం టోర్నీకి ఇంకా సిద్దం కాలేదని తెలుస్తోంది. ఇప్పటికీ చాలా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కనీసం ప్లాస్టర్ వర్క్ కూడా పూర్తి కాలేదని, ఇంకా సీట్ల బిగింపు, ఫ్లడ్ లైట్ల ఏర్పాటు తదితర ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉందని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో డెడ్ లైన్ లోపల పాక్ ఈ పనులను పూర్తి చేయగలదా అన్న మీమాంస ఏర్పడింది. నిజానికి స్టేడియాల పూర్తికి ఐసీసీ ఒక డెడ్ లైన్ ఏర్పాటు చేసింది. దీన్ని పాక్ అందుకోవాల్సి ఉంది.
Gaddafi Stadium (yesterday)
— Sohail Imran (@sohailimrangeo) January 7, 2025
Finishing deadline 25 January #ChampionsTrophy2025 pic.twitter.com/JcI32tZZ3K
టోర్నీని తరలిస్తారా..?
నిజానికి స్టేడియాలు పూర్తిస్థాయిలో సిద్ధమవుతేనే టోర్నీ నిర్వహణ సాధ్యమవుతుంది. ఫలానా డెడ్లైన్ లోపన స్టేడియాల పూర్తి అయితే, ఐసీసీ కొంత మందితో ఒక టీమ్‌ను పంపి, స్టేడియాలను తనిఖీ చేస్తోంది. ఆ టీమ్ హేపీ అయితేనే టోర్నీ నిర్వహణకు ముందడుగు పడుతుంది. అయితే ప్రస్తుత పరిస్తితి చూస్తుంటే టోర్నీ సజావుగా సాగే అవకాశం లేదనిపిస్తోంది. ఇప్పటికే స్టేడియాలకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అందులో స్టేడియాల నిర్మాణం నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇలా అయితే టోర్నీ ఎలా జరుపుతారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇండియా ఆడే మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్లో జరుగుతాయి. దుబాయ్‌లో అన్ని లీగ్ మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఒకవేళ నాకౌట్‌కు చేరితే సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను అక్కడే ఆడుతుంది. ప్రస్తుతానికి భారత్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఒకవేళ ఐసీసీ టోర్నీని మార్చాలని ఫీలయితే దుబాయ్‌కి తరలించే అవకాశముంది.
ట్రై సిరీస్ వేదికల మార్పు..
ఇక స్టేడియాల అప్ గ్రెడేషన్‌తో సతమతమువుతున్న పీసీబీ.. త్వరలో జరిగే ట్రయాంగ్యులర్ వన్డే సిరీస్ వేదికలో కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాక్‌లు పాల్గొనే ఈ సిరీస్‌ను ఏకమొత్తంలో ముల్తాన్‌లో నిర్వహించాలి. అయితే ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు చేసే సమయం లేకపోవడంతో కరాచీ, లాహోర్లోనే మ్యాచ్‌లను నిర్వహించాలని పీసీబీ డిసైడ్ అయింది. ఇక నిర్మాణ పనులకు ఈ సమయం అనుకూలమైనది కాదని, అందుకే లేటవుతుందని కథనాలు వినిపిస్తున్నాయి. అయినా కూడా చాలా ఫాస్ట్ పేస్‌తో నిర్మాణాలు చేస్తున్నామని, డెడ్ లైన్‌కు తగినట్లుగా నిర్మాణాలు పూర్తి చేసి టోర్నీని నిర్వహిస్తామని పీసీబీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, అంత నమ్మకం లేదని ఆదేశ అభిమానులే సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. తర్వాతి వారంలో టోర్నీ నిర్వహణపై పీసీబీతో ఐసీసీ భేటీ అయ్యే అవకాశముంది. ఆ తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది.
Also Read: ప్రపంచకప్‌లో భారత అభిమానులను ఏడ్పించిన క్రికెటర్ - ఇప్పుడు ఆటకు వీడ్కోలు