IPL 2024: నాకూ ఐపీఎల్ ఆడాలని ఉంది, పాక్ క్రికెటర్ మనసులో మాట
Pakistan pacer Hasan Ali: అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలని ప్రతీ క్రికెటర్‌కు ఉంటుందని పాక్ పేసర్ హసన్ అలీ వ్యాఖ్యానించాడు.
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ అలా ముగిసిందో లేదో దేశంలో ఐపీఎల్ సందడి మొదలైంది. వచ్చే నెల 19న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో పది జట్లు అట్టిపెట్టుకున్న, వదులుకున్న, మార్చుకున్న ఆటగాళ్లను ప్రకటించేసి మినీ వేలానికి సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ జరిగి హార్దిక్ పాండ్యా మళ్లీ ముంబై గూటికి చేరాడు. ఐపీఎల్ ఎంతోమంది ఆటగాళ్ల జీవితాలను మలుపుతిప్పింది. ఈ లీగ్‌లో ఆడితే డబ్బుకు డబ్బు, మంచి క్రేజ్ కూడా సంపాదించుకుకోవచ్చని ఆటగాళ్లు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ స్టార్ బౌలర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ప్రపంచ అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలని ప్రతీ క్రికెటర్‌కు ఉంటుందని పాక్ పేసర్ హసన్ అలీ వ్యాఖ్యానించాడు. తనకు ఈ మెగా లీగ్‌లో భాగం కావాలని ఉందని.. భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పకుండా ఆడి తీరతానని చెప్పుకొచ్చాడు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఐపీఎల్‌లో ఆడాలని ఉందని హసన్ అలీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతి పెద్ద లీగ్ అని, ఈ మెగా లీగ్‌లో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ క్రికెటర్ ఆసక్తి చూపుతాడని అలీ అన్నాడు. తనకు కూడా ఐపీఎల్ ఆడాలని ఉందని, భవిష్యత్‌లో అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా ఈ లీగ్ ఆడతానని హసన్ అలీ వ్యాఖ్యానించాడు.
హసన్ అలీ పాకిస్థాన్‌లోని ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో హసన్ అలీ ఆడాడు. ఆరు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ ప్రారంభ సీజన్ అయిన 2008లు పలువురు పాక్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడారు. పాకిస్థాన్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ హఫీజ్, సల్మాన్ భట్, కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్‌తోపాటు చాలామంది ఆటగాళ్లు ఆరంభ సీజన్‌లో ఆడారు. తర్వాత భారత్, పాక్ మధ్య రాజకీయపరంగా సంబంధాలు దెబ్బతినడంతో పాక్ ఆటగాళ్లపై నిషేధం విధించారు. ఈ నిషేధంతో పాక్ ఆటగాళ్లు ప్రపంచంలోనే రిచ్చెస్ట్ లీగ్‌లో ఆడలేకపోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా.. 16 సీజన్‌లు పూర్తి చేసుకుంది. అనతి కాలంలోనే రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్‌గా నిలిచింది. ఈ లీగ్‌లో ఒక్కసారైనా ఆడితే చాలు అని అనుకునే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సైతం ఈ లీగ్‌లో ఆడేందుకు ఆసక్తి కనబరిచాడు. ఎట్టకేలకు గత సీజన్‌లో అరంగేట్రం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ తరహా లీగ్‌లు జరుగుతాయి. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయే వేరు. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply