ODI World Cup 2023: వీళ్లకు ఇదే ‘ఆఖరి’ పోరాటం! - మధుర జ్ఞాపకంగా మార్చుకునేదెవరో?
గడిచిన దశాబ్దిన్నరకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో తమదైన ముద్ర వేసుకున్న పలువురు క్రికెటర్లకు 2023 వన్డే వరల్డ్ కప్ ఆఖరు కానుంది.
ODI World Cup 2023: ఎన్ని అడుగుల ప్రయాణమైనా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాల్సిందే. తమ చివరి ప్రయాణాన్ని మధుర జ్ఞాపకంగా మలుచుకునేందుకు ప్రయత్నించనివారుండరు. క్రీడల్లో అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే క్రీడాకారులు వాటిని మరుపురాని గొప్ప విజయాలతో తమ కెరీర్‌ను ముగించాలనుకుంటారు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో త్వరలో వేడుకగా జరుగనున్న వన్డే వరల్డ్ కప్‌లో కూడా అంతర్జాతీయంగా ఇప్పటికే దిగ్గజాలుగా వెలుగొందుతున్న క్రికెటర్లకు ఇదే ‘ఆఖరి పోరాటం’ అవనుందని చెప్పకతప్పదు. ఈ మెగా టోర్నీ తర్వాత వివిధ జట్లలోని పలువురు సీనియర్ క్రికెటర్ల ఆటను (వన్డేలలో) మనం మళ్లీ చూసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆ ఆటగాళ్లెవరో ఇక్కడ చూద్దాం.
రోహిత్ శర్మ..
గత దశాబ్దం లేదా అంతకంటే ముందే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ ఆడుతున్నవారిలో రోహిత్ ఒకడు. 2007 నుంచి భారత్‌కు ఆడుతున్న హిట్‌మ్యాన్‌కు ఇది ఆఖరి వన్డే వరల్డ్ కప్ అనడంలో సందేహమే లేదు. 16 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన రోహిత్ వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. ఇప్పటికే టీమిండియా.. టీ20లలో రోహిత్‌ను పక్కనబెట్టింది. రాబోయే వన్డే ప్రపంచకప్ తర్వాత రోహిత్.. ఈ ఫార్మాట్‌కూ వీడ్కోలు పలికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడే రిటైర్మెంట్ ప్రకటించకపోయినా 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఆడతాడనుకోవడం అత్యాశే. ఇప్పటికే ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్న హిట్‌మ్యాన్.. కేవలం టెస్టులకే పరిమితం కావొచ్చు.
విరాట్ కోహ్లీ..
రోహిత్ మాదిరిగానే 2008 నుంచి భారత్‌కు ఆడుతున్న కోహ్లీకీ ఇదే ఆఖరి వన్డే వరల్డ్ కప్ అనడంలో సందేహమే లేదు. కోహ్లీ వయసు ప్రస్తుతం 34. 2027 ప్రపంచకప్ నాటికి అతడికి 38 వస్తాయి. ఫిట్‌నెస్ పరంగా చూసుకుంటే కోహ్లీకి ఆడే అవకాశం ఉన్నా అప్పటివరకూ ఆడతాడా..? అన్నది అనుమానమే. ఈసారి వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌కు అనుకూలమైన తీర్పు రాకుంటే జట్టులో చాలా మార్పులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వస్తున్న తరుణంలో కోహ్లీని మరో వరల్డ్ కప్‌లో చూస్తామనుకోవడం అత్యాశే అవుతుంది. ఇదివరకే 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన సభ్యుడిగా ఉన్న కోహ్లీ.. 2015, 2019 ప్రపంచకప్‌లలోనూ ఆడాడు. గత వరల్డ్ కప్‌లో అతడే సారథి. రోహిత్ మాదిరిగానే బీసీసీఐ.. కోహ్లీని కూడా టీ20లలో పక్కకుపెట్టింది.
భారత్ నుంచి రోహిత్, కోహ్లీలతో పాటు రవీంద్ర జడేజా ( ప్రస్తుతం 34 సంవత్సరాలు), మహ్మద్ షమీ (33)లకూ ఇదే ఆఖరి వన్డే ప్రపంచకప్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఇంగ్లాండ్ నుంచి..
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్ జట్టులో కూడా ఈ ప్రపంచకప్ తర్వాత పలువురు సీనియర్లు రిటైర్ కాబోతున్నారు. ఇప్పటికే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి వరల్డ్ కప్ నేపథ్యంలో తిరిగొచ్చిన బెన్ స్టోక్స్ ఈ మెగా టోర్నీ ముగియగానే మళ్లీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడని చెప్పడంలో డౌటే లేదు. పూర్తిగా టెస్టులు, టీ20 లీగ్‌ల మీద దృష్టిపెట్టిన స్టోక్స్‌కు ఇదే ఆఖరి ఛాన్స్. ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ వయసు ఇప్పుడు 33 ఏళ్లు. అతడూ ఇప్పటికే టెస్టుల నుంచి తప్పుకున్నాడు. టీ20 లీగ్‌లలో బట్లర్‌కు మంచి క్రేజ్ ఉంది. రాజస్తాన్ రాయల్స్ ఆ మేరకు బట్లర్‌తో భారీ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నది. దీంతో అతడు ఈ నవంబర్ తర్వాత కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఇద్దరే గాక మోయిన్ అలీ (36), క్రిస్ వోక్స్ (34) లు కూడా వయసుభారంతో వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్నారు.
ఆస్ట్రేలియా నుంచి..
ఆస్ట్రేలియా జట్టులో నలుగురు కీలక ఆటగాళ్లు ఈ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారిలో స్టీవ్ స్మిత్ (34 ఏళ్లు), డేవిడ్ వార్నర్ (36), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (34), మిచెల్ స్టార్క్ (33)లు ముందువరుసలో ఉన్నారు. వార్నర్ అయితే వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఇదివరకే చెప్పాడు. వయసు భారం, ఫిట్‌నెస్ కారణాల రీత్యా మ్యాక్సీ, స్టార్క్, స్మిత్ కూడా 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకోవడం ఖాయమే..!
సఫారీ టీమ్‌లో..
దక్షిణాఫ్రికా టీమ్‌లో కీలక ఆటగాడైన క్వింటన్ డికాక్ ఇదివరకే తాను వన్డే వరల్డ్ కప్ తర్వాత తప్పుకుంటానని ప్రకటించాడు. మిడిలార్డర్‌లో కీలక బ్యాటర్ డేవిడ్ మిల్లర్ వయసు 34 ఏళ్లు. సఫారీ కెప్టెన్ టెంబ బవుమాకు 33 ఏళ్లు. ఈ ఇద్దరికీ ఇదే ఆఖరి వన్డే ప్రపంచకప్ కావొచ్చు.
కేన్ మామ కూడా..
న్యూజిలాండ్ జట్టు నుంచి కేన్ విలియమ్సన్ చాలాకాలంగా గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో కివీస్‌ను ఫైనల్ చేర్చిన కేన్ మామ.. 2021 టీ20 ప్రపంచకప్‌లోనూ అదే రిపీట్ చేశాడు. 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న కేన్ వయసు 33 సంవత్సరాలు. ఈ ప్రపంచకప్ తర్వాత కేన్ మామ వన్డేలు ఆడటం అనుమానమే. ఇప్పటికే టీమ్ కాంట్రాక్టు వదులకుని మళ్లీ వచ్చిన ట్రెంట్ బౌల్ట్ (34) ప్రపంచకప్ తర్వాత మళ్లీ బ్యాగ్ సర్దేస్తాడు. ఆ జట్టు మరో పేసర్ టిమ్ సౌథీ (34)కి ఇదే ఆఖరి ప్రపంచకప్ కావొచ్చు.
బంగ్లా నుంచి..
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ వయసు ఇప్పటికే 36 ఏళ్లు దాటింది. ఈ ప్రపంచకప్ తర్వాత షకిబ్ రిటైర్మెంట్ ప్రకటన చేసే అవకాశాలున్నాయి. షకిబ్‌తో పాటు ఇదివరకే రిటైర్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకున్న తమీమ్ ఇక్బాల్ (34) లూ మళ్లీ ఆడతారా..?అన్నది అనుమానమే..
పైన పేర్కొన్నవారిలో పలువురు వన్డే ఫార్మాట్ నుంచి దూరమైనా టీ20లు, టెస్టులలో కొనసాగే అవకాశముంది. టీ20ల మోజులో వన్డేలకు ఆదరణ కోల్పోతున్న తరుణంలో క్రికెటర్లు కూడా ఈ ఫార్మాట్‌పై పునరాలోచనలో పడ్డారు.