NZ vs PAK Live Streaming: రేపే పాక్- న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్, ఫైనల్ బెర్తు ఎవరిదో!
NZ vs PAK Live Streaming: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12 దశ దాటి సెమీఫైనల్స్ కు చేరుకుంది. రేపు న్యూజిలాండ్- పాకిస్థాన్ ల మధ్య మొదటి సెమీస్ జరగనుంది.
NZ vs PAK Live Streaming: ఆది నుంచి సంచలనాలతో ఆకట్టుకున్న టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12 దశ దాటి సెమీఫైనల్స్ కు చేరుకుంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధించాయి. రేపు న్యూజిలాండ్- పాకిస్థాన్ ల మధ్య మొదటి సెమీస్ జరగనుంది.
టీ20 ప్రపంచకప్ తొలి సెమీస్ లో రేపు (నవంబర్ 9) పాకిస్థాన్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. గ్రూపు ఏ నుంచి అగ్రస్థానంలో ఉన్న కివీస్.. గ్రూప్ బీలో రెండో స్థానంలో నిలిచిన పాక్ తో సెమీస్ ఆడనుంది. సూపర్- 12 లో 3 విజయాలు, ఒక ఓటమి, ఒక రద్దుతో న్యూజిలాండ్ 7 పాయింట్లతో ఉంది. పాక్ 3 విజయాలు, 2 ఓటములతో 6 పాయింట్లే సాధించింది. అయితే అదృష్టం కలిసొచ్చి సెమీస్ కు చేరుకుంది. రేపు మ్యాచ్ సందర్భంగా ఈ రెండు జట్ల బలాబలాలేంటో చూద్దాం.
సమష్టి ప్రదర్శనతో సెమీస్ కు
గ్రూప్ ఏ లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఇప్పటివరకు బ్యాటర్లు, బౌలర్ల సమష్టి ప్రదర్శనతో విజయాలు సాధించింది. సూపర్- 12 తొలి మ్యాచులోనే డిఫెండిగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది కివీస్. భారీ తేడాతో ఆ జట్టుపై గెలిచి మెరుగైన రన్ రేట్ సాధించింది. ఇప్పటివరకు పొట్టి కప్పులో సెంచరీలు సాధించిన బ్యాటరల్లో ఒకరు కివీస్ నుంచే ఉన్నారు. గ్లెన్ ఫిలిప్స్ శతకం బాదగా.. డెవాన్ కాన్వే ఆ మార్కుకు దగ్గరగా వచ్చాడు. తాజాగా కెప్టెన్ విలియమ్సన్ ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, ఐష్ సోధి, లూకీ ఫెర్గూసన్ లాంటి వారితో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. అయితే నాకౌట్ మ్యాచులు కివీస్ కు కలిసిరావు. గత వన్డే ప్రపంచకప్ లో ఫైనల్ కు వెళ్లినప్పటికీ.. అదృష్టం కలసిరాక ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలయ్యింది.
పాక్ తక్కువేమీ కాదు
తొలి రెండు మ్యాచులు ఓడిన పాకిస్థాన్ సెమీస్ కు చేరుకోవడం అదృష్టమనే చెప్పాలి. భారత్, జింబాబ్వేలపై ఓడిన పాక్ ఆ తర్వాత వరుసగా 3 మ్యాచులు గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. నెదర్లాండ్స్ పై సౌతాఫ్రికా ఓడిపోవడం ఆ జట్టుకు కలిసొచ్చింది. పాక్ బ్యాటింగ్ బలం ఆ జట్టు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ అజాం. అయితే ఈ ప్రపంచకప్ లో వారిద్దరూ అంచనాలను అందుకోలేదు. మిడిలార్డర్ రాణించటంతో విజయాలు అందుకుంది. షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాన్ మసూద్ వంటి వారు నిలకడగా రాణిస్తున్నారు. ఆ జట్టు ప్రధాన బౌలర్ షహీన్ అఫ్రిదీ బంగ్లాదేశ్ తో మ్యాచుతో పూర్తిగా ఫాంలోకి రావడం సానుకూలాంశం. హారిస్ రవూఫ్, నసీం షా వంటి బౌలర్లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది.
తొలి సెమీస్ లో గెలిచి మొదటి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో రెండు జట్లు ఉన్నాయి.
పిచ్ పరిస్థితి
మొదటి సెమీస్ మ్యాచ్ ఎస్ సీ జీ (సిడ్నీ క్రికెట్ గ్రౌండ్) లో జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. బౌలర్లకు కొంతమేర అనుకూలిస్తుంది. మ్యాచ్ జరిగే బుధవారం రోజు ఇక్కడ వర్షం పడే సూచనలు ఉన్నాయి. అయితే వర్షం ఉదయం రావొచ్చని తెలుస్తోంది. మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం 1.30కు ప్రారంభమవుతుంది.
ముఖాముఖి
పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచుల్లో పాక్ దే పైచేయి. మొత్తం 28 మ్యాచుల్లో పాక్ 17 గెలిచింది. ప్రపంచకప్ టోర్నీల్లో తలపడిన ఆరు మ్యాచుల్లో నాలుగింట్లో విజయం సాధించింది.
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
పాకిస్థాన్ తుది జట్టు (అంచనా)
బాబర్ అజాం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వాసీం, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది.