(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2024: గుజరాత్ టైటాన్స్ మరో భారీ షాక్! , ప్రాంచైజీ మారనున్న స్టార్ బౌలర్?
Mohammed Shami: గుజరాత్ టైటాన్స్ జట్టుకు మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన మహ్మద్ షమీ జట్టును వీడే అవకాశం కనిపిస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024)సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans )జట్టుకు మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) జట్టుకు దూరంకాగా ఇప్పుడు మరో స్టార్ బౌలర్, భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన మహ్మద్ షమీ(Mohammed Shami) కూడా జట్టును వీడే అవకాశం కనిపిస్తోంది.
గుజరాత్‌లో ప్రధాన పేసర్‌గా ఉన్న మహ్మద్ షమీని ట్రేడింగ్ కోసం ఓ ఫ్రాంఛైజీ సంప్రదించిందని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా గుజరాత్ టైటాన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కల్నల్ అర్విందర్ సింగ్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడంతో మరోసారి కలకలం రేగింది. ప్రతి ఫ్రాంఛైజీకి అగ్రశ్రేణి ఆటగాళ్లను ఎంచుకునే హక్కు ఉందని... ఒకవేళ ఏదైనా ఫ్రాంఛైజీ ట్రేడింగ్ కోసం నేరుగా ఆటగాడిని సంప్రదించినట్లయితే అది తప్పని... ఈ విధానం పట్ల గుజరాత్ టైటాన్స్ టీమ్ మేనేజ్‌మెంట్ సంతోషంగా లేదని గుజరాత్ టైటాన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కల్నల్ అర్విందర్ సింగ్ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆటగాళ్ల ట్రేడింగ్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొన్ని నిబంధనలు రూపొందించిందని, ఏ ప్లేయర్‌ను అయిన ఓ ఫ్రాంచైజీ కావాలనుకుంటే ఈ విషయాన్ని సదరు ప్రాంచైజీ బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని అర్విందర్ సింగ్ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ నేరుగా మా కోచింగ్ బృందాన్ని సంప్రదించిందని.. ఇది చాలా తప్పని.. బదిలీ గురించి అయితే ముందే తమతో మాట్లాడి ఉండే వారని... నిజానికి ఈ విషయం మేము తరువాత తెలుసుకున్నామని అర్విందర్ సింగ్ చెప్పారు. అయితే, ఆ ఫ్రాంఛైజీ ఏది అనే విషయాన్ని అతడు వెల్లడించలేదు. మరీ షమీ ప్రాంచైజీ మారతాడా లేదా అన్నది మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఎందుకంటే ఆటగాళ్ల ట్రేడింగ్ కోసం డిసెంబర్ 12 వరకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. డిసెంబరు 19న దుబాయ్‌లో మినీ వేలం నిర్వహించనున్నారు.
ఐపీఎల్(IPL)లో హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ముంబై జట్టులో చేరతాడన్న ఊహాగానాలే నిజమయ్యాయి. ఈ స్టార్ ఆల్‌రౌండర్ తిరిగి ముంబయి ఇండియన్స్( Mumbai Indians ) గూటికే చేరాడు. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans )ను ఫైనల్స్ చేర్చడమే కాక, 2022లో విజేతగా కూడా నిలిపిన పాండ్యా.. వచ్చే సీజన్ నుంచి తిరిగి ముంబయికి ఆడబోతున్నాడు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పాండ్యా ముంబయి జట్టు సొంతమయ్యాడు. ముంబైలో చేరేందుకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యా వైదొలిగాడు. IPL చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ జరిగి హార్దిక్ పాండ్యా ముంబై జట్టు సొంతమయ్యాడని తెలుస్తోంది. తొలి సీజన్‌లోనే ట్రోఫీ అందించిన కెప్టెన్‌ను విడిచిపెట్టేందుకు గుజరాత్ అంగీకరించడం సంచలనంగా మారింది. హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు వేగంగా పావులు కలిపిన ముంబై అనుకున్నది సాధించింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే సమయం ఇక ముగిసిందనుకున్న సమయంలో ఈ సంచలనం జరిగింది. ఆల్ క్యాష్ ట్రేడ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వదిలి ముంబైతో చేరాడు.