Namibia beat Oman in Super Over: క్రికెట్ ప్రపంచాన్ని పసికూనల పోరు మధ్య జరిగిన ఆసక్తికర పోరు మునివేళ్లపై నిలబెట్టింది. నమీబియా-ఒమన్(Namibia vs Oman)ల మధ్య జరిగిన మ్యాచ్... తొలుత టై అయింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా సరిగ్గా 109 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్‌లో ఒమన్‌పై నమీబియా విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో విరుచుకుపడ్డ నమీబియా బ్యాటర్లు 21 పరుగులు చేయడంతో విజయం ఖాయమైంది. ఒమన్ బ్యాటర్లు కేవలం పది పరుగులకే పరిమితం కావడంతో నమీబియా సూపర్ ఓవర్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సూపర్ ఓవర్ సాగిందిలా..
టీ 20 ప్రపంచకప్‌లో పసికూనల మధ్య జరిగిన పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఒమన్ నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగులు చేసింది. బిలాల్ ఖాన్ వేసిన ఓవర్‌లో నమీబియా ఓపెనర్లు వైస్-ఎరాస్మస్ చెలరేగిపోయారు. తొలి బంతికి ఫోర్ కొట్టిన వైస్... రెండో బంతికి భారీ సిక్సర్ కొట్టాడు. మూడో బంతికి రెండు పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి ఒక్క పరుగు వచ్చింది. ఇక అయిదో బంతిని, ఆరు బంతిని ఎరాస్మస్ రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో నమీబియా సూపర్ ఓవర్‌లో 21 పరుగులు చేసింది. అనంతరం ఆరు బంతుల్లో 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఒమన్ బ్యాటర్లు తేలిపోయారు. వైస్ వేసిన సూపర్ ఓవర్‌లో తొలి బంతికి రెండు పరుగులు రాగా... రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి వికెట్ పడింది. దీంతో చివరి మూడు బంతుల్లో ఒమన్ విజయానికి 20 పరుగులు చేయాల్సి వచ్చింది. నాలుగు, అయిదు బంతులకు ఒకే పరుగు రాగా... ఆరు బంతికి సిక్స్ వచ్చింది. దీంతో ఒమన్ కేవలం పది పరుగులు మాత్రమే చేసింది. దీంతో నమీబియా 11 పరుగులతో విజయం సాధించింది.
పసికూనల మహా పోరు
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్... నమీబియా బౌలర్ల ధాటికి 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్ రుబెన్ ట్రంపెల్ మెన్ నాలుగు వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించాడు. ఒమన్ బౌలర్లలో ఏడుగురు బ్యాటర్లు కనీసం సింగిల్ డిజిట్‌ను కూడా దాటలేదు. అనంతరం 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా 109 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో నమీబియా.. తడబడింది. 109 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో నమీబియా ఒకే పరుగు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్ 45 పరుగులతో రాణించాడు. ఫ్రైలింక్ 45 పరుగులు చేయడంతో నమీబియా సునాయస విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఒమన్ బౌలర్లు పట్టు విడవలేదు. చివరి వరకూ పోరాడారు. చివరి ఓవర్ చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో ఒకే పరుగు రావడంతో మ్యాచ్ టై అయింది.