Murali Vijay on Sehwag: సెహ్వాగ్‌లా నాకు అండ దొరకలేదు - అయినా అతడి బ్యాటింగ్ అమేజింగ్!
Murali Vijay on Sehwag: వీరేంద్ర సెహ్వాగ్‌కు దొరికినంత అండదండలు, స్వేచ్ఛ తను పొందలేదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు.
Murali Vijay on Sehwag:
వీరేంద్ర సెహ్వాగ్‌కు దొరికినంత అండదండలు, స్వేచ్ఛ తను పొందలేదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. తనలాంటి వాళ్లను అంతా వయసు మళ్లిన క్రికెటర్లుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బీసీసీఐతో విసిగిపోయానని విదేశాల్లో అవకాశాల కోసం చూస్తున్నానని వెల్లడించాడు. వీరూతో కలిసి ఓపెనింగ్ చేయడం అద్భుతమని ప్రశంసించాడు. అతడిలా ఇంకెవ్వరూ ఆడలేరని స్పష్టం చేశాడు. టీమ్‌ఇండియా మహిళల జట్టు మాజీ కోచ్ డబ్ల్యూ వీ రామన్‌కు అతడు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
'నిజాయతీగా చెప్పాలంటే వీరేంద్ర సెహ్వాగ్‌కు దొరికినంత స్వేచ్ఛ నాకు దొరకలేదు. అలాంటి అండదండలు నాకు లభించలేదు. నాతోనూ బహిరంగంగా మాట్లాడితే, అండగా నిలబడితే బహుశా కొత్తగా ప్రయత్నించేవాడిని. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు జట్టు యాజమాన్యం ప్రోత్సాహం అవసరం. ఎందుకంటే ఇది అత్యున్నత పోటీ క్రికెట్. భిన్నంగా ప్రయోగాలు చేసేందుకు ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చు' అని మురళీ విజయ్ అన్నాడు.
మరో ఎండ్‌లో నిలబడి వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ చూడటం అద్భుతంగా ఉంటుందని విజయ్ పేర్కొన్నారు. అతడి ఆటతీరు తన సహజ దూకుడును నియంత్రించుకొనేలా చేసేదన్నాడు. అతడి బ్యాటింగ్ ఫార్మూలా చాలా సింపుల్‌గా ఉంటుందని వెల్లడించాడు.
'జట్టులో నిలకడగా ఆడటం ముఖ్యం. ప్రతిదీ ఒక ప్యాకేజీలా దొరుకుతుంది. అందుకే జట్టు అవసరాలను బట్టి ఆడాల్సి ఉంటుంది. సెహ్వాగ్ క్రీజులో ఉంటే నా దూకుడును నియంత్రించుకోవాల్సి వచ్చేది. ఆడటం కష్టంగా ఉండేది. కానీ అతడు స్వేచ్ఛగా ఆడటం చూస్తుంటే మజా వచ్చేది. అలాంటి బ్యాటింగ్ ఇంకెవ్వరికీ సాధ్యమవ్వదు. భారత క్రికెట్‌ను అతడు మార్చేశాడు. నేను చూసిందాని కన్నా అతడు చాలా భిన్నం. నాకు అతడితో మాట్లాడే గౌరవం దక్కింది. బంతిని చూడు బలంగా బాదేయ్ అనేదే అతడి ఫార్ములా. 145-150 కి.మీ వేగంతో బంతులేసే బౌలర్లను ఆడుతూ పాటలు పాడేవాడు. ఇదేమీ సాధారణం కాదు' అని మురళీ విజయ్ పేర్కొన్నాడు.
View this post on Instagram
View this post on Instagram