MS Dhoni: ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ, ఓటర్లలో అవగాహనా పెంచేందుకు ఈసీ ప్లాన్స్
Jharkhand Assembly Election | ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్ గా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన లో తెలిపింది.
Jharkhand Election 2024 | రాంఛీ: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. వచ్చే నెలలో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ధోనీ సొంత రాష్ట్రం ఝార్ఖండ్ కావడంతో ప్రజలపై ప్రభావం చూపే సెలబ్రిటీ సామాజిక బాధ్యత తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావించింది. ఈ మేరకు ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ వెల్లడించారు.
ఈసీకి సమ్మతి తెలిపిన ఎంఎస్ ధోనీ
ఎన్నికల సమయంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు అవగాహనా పెంచే కార్యక్రమాలలో ధోనీ ఫొటో వినియోగించడంపై భారత మాజీ కెప్టెన్ ను ఎలక్షన్ కమిషన్ సంప్రదించింది. ప్రజల్లో చైతన్యం వచ్చి అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనే సామాజిక బాధ్యత ఉన్న కార్యక్రమంలో తన ఫొటోను వినియోగించుకునేందుకు ఈసీకి ధోనీ సమ్మతి తెలిపారు. త్వరలోనే ఎన్నికల అధికారులు ధోనీని నేరుగా కలిసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన తరఫున చేయాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తామని రవి కుమార్ తెలిపారు.
రెండు దశలలో ఝార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు
సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ పేరుతో ఓటర్లలో అవగాహన పెంచే కార్యక్రమాన్ని ఈసీ చేపట్టింది. ఇందులో భాగంగా ధోనీ తన సొంత రాష్ట్రంలో ఓటర్లలో చైతన్యం తీసుకురావడంతో పాటు కొత్త ఓటర్లలో ఎన్నికలపై అవగాహనా తీసుకువచ్చేందుకు కృషి చేయనున్నారు. ఝార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. నవంబరు 13, నవంబర్ 20న రెండు దశల్లో ఝార్ఖండ్ అసెంబ్లీకి ఈసీ ఎన్నికలు నిర్వహించనుండగా.. నవంబరు 23న ఓట్లు లెక్కింపు ప్రక్రియతో ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది.
మరోవైపు ధోనీ న్యూ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు చేసిన నెటిజన్లు, ఫ్యాన్స్ నిజంగానే ధోనీ వయసు 43 ఏళ్లా అని కామెంట్ చేస్తున్నారు. ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్ లో సీఎస్కేకు ఆడతారా, అసలు ఐపీఎల్ 2025లో ధోనీ ఆటను చూస్తామా లేదా అని ఫ్యాన్స్ లో ఇంకా టెన్షన్ నెలకొంది. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే.. ధోనీ వచ్చే ఐపీఎల్ లోనూ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. అయితే బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం అన్ క్యాప్డ్ ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉంది. వచ్చే రెండు, మూడు సీజన్లకు ఐపీఎల్ పాలకమండలి బిసీసీఐ కొత్త రూల్స్ ను అమలు చేయనుంది.