Most T20 Wickets 2022: మీ పెద్దోళ్లున్నారే! అంటూనే ఎక్కువ వికెట్లు పడగొట్టిన కుర్రాళ్లు - 2022 టీ20 టాప్ 10 బౌలర్లు వీరే!
Most T20 Wickets 2022: 2022లో టాప్-10 వికెట్ల వీరుల్లో ముగ్గురు అసోసియేట్ దేశాల నుంచే వచ్చారు. ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో టీ20ల్లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన టాప్-10 మొనగాళ్లెవరో చూసేద్దామా!
Most T20 Wickets 2022:
ఒకప్పుడు క్రికెట్ అంటే పెద్ద జట్లదే ఆధిపత్యం! బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో వారిదే హవా! టీ20 ఫార్మాట్ ఆవిర్భావంతో అనామమక ఆటగాళ్లూ ఇప్పుడు దుమ్మురేపుతున్నారు. మెరుపు సెంచరీలతో ఆకట్టుకుంటున్నారు. టపటపా వికెట్లు పడగొడుతున్నారు. 2022లో టాప్-10 వికెట్ల వీరుల్లో ముగ్గురు అసోసియేట్ దేశాల నుంచే రావడం ప్రత్యేకం. ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో టీ20ల్లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన టాప్-10 మొనగాళ్లెవరో చూసేద్దామా!
జోష్ లిటిల్: 2022లో ఈ ఐర్లాండ్ ఆటగాడే టాప్‌లో నిలిచాడు. 26 మ్యాచుల్లో 18.92 సగటు, 7.58 ఎకానమీతో 39 వికెట్లు పడగొట్టాడు. 97.2 ఓవర్లు విసిరి 738 పరుగులు ఇచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో స్టార్ బ్యాటర్లను తన లెఫ్ట్ హ్యాండ్ సీమ్‌తో వణికించాడు.
సందీప్ లామిచాన్: కుర్రాడే కానీ బరిలోకి దిగితే మహా మహా బ్యాటర్లనూ దెబ్బకొట్టగలడు సందీప్. మిస్టరీ స్పిన్‌తో అన్ని లీగుల్లో రాణిస్తున్నాడు. ఈ ఏడాది నేపాల్ తరఫున 18 మ్యాచుల్లో 10.79 సగటు, 5.77 ఎకానమీతో 38 వికెట్లు పడగొట్టాడు. 71 ఓవర్లు వేసి 410 రన్స్ ఇచ్చాడు.
భువనేశ్వర్ కుమార్: టీమ్‌ఇండియా తరఫున పొట్టి ఫార్మాట్లో ఎక్కువ వికెట్లు పడగొట్టింది భువీనే! కీలక మ్యాచుల్లో విఫలమయ్యాడు గానీ ద్వైపాక్షిక సిరీసుల్లో అతడిదే హవా. ఈ ఏడాది 32 మ్యాచుల్లో 19.57 సగటు, 6.98 ఎకానమీతో 37 వికెట్లు పడగొట్టాడు. 5/4 బెస్ట్ ఫిగర్స్. 3 సార్లు 4 వికెట్ల ఘనత అందుకున్నాడు.
హసరంగ డిసిల్వా: ఆసియాకప్, టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంకకు చక్కని విజయాలు అందించాడు హసరంగ. అవసరమైతే బ్యాటుతోనూ ఆదుకున్నాడు. కేవలం 19 మ్యాచుల్లో 15.68 సగటు, 7.40 ఎకానమీతో 34 వికెట్లు సాధించాడు.
అర్షదీప్ సింగ్: అరంగేట్రం ఏడాదిలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అర్షదీప్. తన పరిణతి, లెఫ్టార్మ్ సీమ్, స్వింగ్, యార్కర్లతో ప్రత్యర్థులకు సవాళ్లు విసిరాడు. 21 మ్యాచుల్లో 18.12 సగటు, 8.17 ఎకానమీతో 33 వికెట్లు పడగొట్టాడు.
హ్యారిస్ రౌఫ్: షాహిన్ అఫ్రీది గురించి ఎక్కువ మాట్లాడతారుగానీ పాకిస్థాన్‌కు ఎక్కువ వికెట్లు అందించింది హ్యారిస్ రౌఫ్! ఆసియా, ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శన ఎలాగుందో అందరికీ తెలిసిందే. ఈ ఏడాది 23 మ్యాచుల్లో 20.74 సగటు, 7.55 ఎకానమీతో 31 వికెట్లు సాధించాడు.
ఇష్ సోధి: క్విక్ పేసర్లకే కాదు దిగ్గజ స్పిన్నర్లకూ న్యూజిలాండ్ వేదికగా మారింది. ఇష్ సోధి అందులో ఒకడు. మిడిల్‌లో వికెట్లు తీస్తూ జట్టుకు కీలకంగా మారాడు. 22 మ్యాచుల్లో 22.96 సగటు, 7.97 ఎకానమీతో 28 వికెట్లు పడగొట్టాడు.
జేసన్ హోల్డర్: కష్టాల్లో పడ్డ ప్రతిసారీ విండీస్‌ను ఆదుకొనే ఆటగాడు జేసన్ హోల్డర్. తన వేగంతో డిఫరెంట్ యాంగిల్స్‌తో వికెట్లు తీస్తుంటాడు. 2022లో అతడు 19 మ్యాచుల్లో 20.71 సగటు, 8.23 ఎకానమీతో 28 వికెట్లు పడగొట్టాడు. 4 వికెట్ల ఘనతను రెండుసార్లు అందుకున్నాడు.
జోస్ హేజిల్‌వుడ్: చక్కని లైన్ అండ్ లెంగ్త్‌ల్లో బంతులేయడం హేజిల్‌వుడ్ ప్రత్యేకత. టెస్టు లెంగ్తుల్లో బంతులేసి టీ20ల్లో వికెట్లు తీస్తుంటాడు. ఆరంభ, ఆఖరి, మధ్య ఓవర్లలో ఎప్పుడైనా వికెట్లు తీయగలడు. ఈ ఏడాది 17 మ్యాచుల్లో 18.23 సగటు, 7.52 ఎకానమీతో 26 వికెట్లు తీశాడు.
ధ్రువ్ మైసూర్యా: ఈ పేరు ఎప్పుడూ విన్నట్టు అనిపించడం లేదు కదా! అవును, బోట్స్‌వానాకు ఆడుతుంటాడు. ఈ ఏడాది ఆడింది 11 మ్యాచులే అయినా 7.64 సగటు, 5.21 ఎకానమీతో 25 వికెట్లు తీసి టాప్-10లో నిలిచాడు. 4సార్లు 4 వికెట్ల ఘనత అందుకోవడం వెరీ వెరీ స్పెషల్!