Ravichandran Ahswin Comments: సిరాజ్‌ను అండరెస్టిమేట్ చేశాం.. ఇప్పటికైనా తనకు తగిన గుర్తింపు ఇవ్వాలి.. మాజీ స్టార్ ఆల్ రౌండర్ సూచన
ఇంగ్లాండ్ పర్యటనలో ఐదుకు ఐదు టెస్టులు ఆడి, లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచిన సిరాజ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కీలకమైన ఐదో టెస్టులో 9 వికెట్లతో సిరాజ్ సత్తా చాటిన సంగతి తెలిసిందే.

Mohammad Siraj News: ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా విజయం సాధించడం వెనకాల హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొమ్మిది వికెట్లతో చెలరేగిన సిరాజ్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేసినప్పటికీ, వారిని కాదని, కీలకదశలో వికెట్లు తీసి, ఒత్తిడిని తట్టుకుని నిలబడిన అతడికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సిరాజ్ బౌలింగ్ ను చూసి ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ లోని అన్ని మ్యాచ్ లు ఆడటంతోపాటు 185కిపైగా ఓవర్లు బౌలింగ్ చేశాడని గుర్తు చేశారు. అలాగే 23 వికెట్లు సాధించి, సిరీస్ లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అలాంటి సిరాజ్ పై భారత మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు.
MOHAMMAD SIRAJ IN ICONIC TEST WINS FOR INDIA:
— Tanuj (@ImTanujSingh) August 5, 2025
At Gabba 2021 - 5/73 & 1/77
At Lord’s 2021 - 4/94 & 4/32
At Centurion 2021 - 1/45 & 2/47
At Cape Town 2024 - 6/15 & 1/31
At Perth 2024 - 2/20 & 3/51
At Edgbaston 2025 - 6/70 & 1/57
At Oval 2025 - 4/86 & 5/104
- THE CLUTCH PLAYER.🙇 pic.twitter.com/AWLxBloAXy
ఇప్పటికైనా గుర్తించాలి..
ఇన్నాళ్లుగా సిరాజ్ కు రావాల్సినంత గుర్తింపు రాలేదని, ఇప్పటికైనా అతడి ప్రతిభను గుర్తించాలని అశ్విన్ అభిప్రాయ పడ్డాడు. ఈ సిరీస్ లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, కీలక దశలో వికెట్లు తీసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నాడు. అతను టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా మారాడని ప్రశంసించాడు. అతని కమిట్మెంట్ అద్బుతమని, ఐదు టెస్టుల్లోనూ బౌలింగ్ చేసి, అత్యధిక వికెట్లు తీశాడని ప్రశంసించాడు. అయితే వయసు పై బడుతున్న కొద్దీ, అతడిని మెరుగ్గా యూజ్ చేసుకోవాలని, ముఖ్యమైన మ్యాచ్ ల విషయంలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ తనకు కూడా వర్తింప జేయాలని సూచించాడు. ముఖ్యమైన సిరీస్ లలో మాత్రమే అతడిని ఆడించాలని పేర్కొన్నాడు.
ప్రత్యామ్నాయాలు సిద్దం చేయాలి..
భారత పేస్ విభాగాన్నిమరింత బలోపేతం చేయాలని, స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా లేని సమయంలో సిరాజ్ ఒక్కడిపైనే టీమ్ ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు సిద్దం చేయాలని అశ్విన్ సూచించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ అద్బుతంగా ఆడారని, అలాంటి వాళ్లను ప్రొత్సహించాలని, అర్షదీప్ సింగ్ లాంటి యువ బౌలర్లను సిద్ధం చేయాలని తెలిపాడు. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2-2 తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి, మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా, రెండు, ఐదో టెస్టులో ఇండియా గెలిచింది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. భారత కెప్టెన్ శుభమాన్ గిల్, ఇంగ్లాండ్ విధ్వంసక ప్లేయర్ హేరీ బ్రూక్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.




















