BCCI Double Standards!: బీసీసీఐ డబుల్ స్టాండర్స్.. శ్రేయస్ కు అన్యాయం.. ఆ ఆటగాడికి ఒక రూల్.. శ్రేయస్ ఒక రూలా..? మాజీ క్రికెటర్ ఫైర్
2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది. జూన్ మూడో వారం నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన ఆగస్టు వరకు కొనసాగుతుంది.

Ind Vs Eng 5 Match Test Series: ఇంగ్లాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది ప్లేయర్లను ఎంపిక చేయకపోవడం, సర్ప్రైజింగ్ గా మరికొంతమందిని ఎంపిక చేయడం విచిత్రంగా ఉంది. అసలు ఆటగాళ్లను ఇంత ముఖ్యమైన పర్యటనకు ఏ బేస్ పై ఎంపిక చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అటు దేశవాళీల్లోనూ, ఇటు వన్డేల్లో, ఐపీఎల్లో చక్కగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యకత్ం చేశాడు. అన్ని ఫార్మాట్లలో శ్రేయస్ బాగా ఆడుతున్నాడని, అలాంటి ఆటగాడిని పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. ఇక ఏ గణాంకాలు తీసుకుని శ్రేయస్ ను పక్కన పెట్టారని అడుగుతున్నాడు. అదే సమయంలో జట్టులోకి నూతనంగా ఎంపికైన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ పై చర్చను లెవనెత్తాడు.
ఏ బేసిస్ పై..
నిజానికి సుదర్శన్ చాలా మంచి ఆటగాడని, ఐపీఎల్లో సత్తా చాటి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడని కైఫ్ గుర్తు చేశాడు. కేవలం ఐపీఎల్ ప్రదర్శననే ఇంగ్లాండ్ టూరుకు గీటురాయిగా తీసుకోవద్దని, అతని రెడ్ బాల్ ఫార్మాట్ ప్రదర్శనను కూడా చూడాలని హితవు పలికాడు. ఒకవేళ ఐపీఎల్ ప్రదర్శనే గీటురాయి అనుకుంటే శ్రేయస్ కూడా బాగా రాణించాడని, అటు పంజాబ్ కెప్టెన్ గా వ్యవహరించి, 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు తీసుకొచ్చిన విషయాన్ని స్పష్టం చేశాడు. అసలు సెలెక్టర్లు ఏ బేసిస్ పై ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించాడు. బీసీసీఐ, సెలెక్టర్లు ద్వంద్వ వైఖరితో నిర్ణయాలు తీసుకున్నారని దుయ్యబట్టాడు.
శ్రేయస్ థాంక్స్..
ఇక 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవడంపై పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అనందం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తనకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇవ్వడంతోనే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నాడు. నిర్ణయాలను సొంతంగా తీసుకునే స్వేచ్ఛను ఇచ్చాడని, దీంతో తను చాలా ఫ్రీగా పని చేశానని పేర్కొన్నాడు. మరోవైపు ఈ సీజన్ లో అదరగొట్టిన పంజాబ్.. 9 విజయాలతో ఓవరాల్ గా 19 పాయింట్లతో లీగ్ టేబుల్లో టాప్ లో నిలిచింది. దీంతో క్వాలిఫయర్ 1కు అర్హత సాధించింది. గురువారం జరిగే క్వాలిఫయర్ 1లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ చేరగా.. మరో జట్టు క్వాలిఫయర్ 2 ఆడుతుంది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా ఈనెల 30న ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుండగా, గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 ఆడుతుంది. ఇక ప్లే ఆఫ్స్ కు చేరిన నాలుగు జట్లలో ముంబై ఇండియన్స్ ఐదుసార్ల చాంపియన్ గా నిలవగా, గుజరాత్ టైటాన్స్ ఒక్కసారి టైటిల్ కొట్టింది. మూడుసార్లు ఆర్సీబీ, ఒక్కసారి పంజాబ్ కింగ్స్ రన్నరప్ తోనే సరిపెట్టు కున్నాయి.




















