ICC World Cup 2024: ఇండియా-పాక్ మ్యాచ్ టికెట్ రూ.16.6 లక్షలా? - లలిత్ మోదీ
IND Vs PAK Match Tickets: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు చాలా ఆసక్తి. ఈ టీ 20 వరల్డ్ కప్‌లో దాన్ని చూడాలంటే ఆస్తులమ్ముకోవాలంటున్నారు లలిత్ మోదీ.
![ICC World Cup 2024: ఇండియా-పాక్ మ్యాచ్ టికెట్ రూ.16.6 లక్షలా? - లలిత్ మోదీ Lalith Modi accuses ICC over Ind Vs Pak cricket match ticket cost ICC World Cup 2024: ఇండియా-పాక్ మ్యాచ్ టికెట్ రూ.16.6 లక్షలా? - లలిత్ మోదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/6538323b82f7f64b6b243fe4fcea2d6117164734425771015_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lalith Modi Comments on ICC World Cup 2024 Tickets: టీ 20 వరల్డ్ కప్ 2024 జూన్ 2 నుంచి మొదలవ్వనుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాల ఉమ్మడి ఆతిథ్యంలో జరుగనున్న ఈ మెగా టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 20 టీములు తలపడనున్నాయి. కానీ ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా న్యూయార్క్‌లో జూన్ 9 న జరుగనున్న ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కోసమే ఎదురు చూస్తున్నారు. మామూలుగానే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు చాలా ఆసక్తి. అలాంటిది టీ 20 ప్రపంచ కప్ సమరమంటే చెవి కోసుకుంటారు. అవకాశమొస్తే దాన్ని లైవ్ లో చూసేందుకు ఎతైనా ఖర్చు చేస్తారు. ఈ టీ 20 వరల్డ్ కప్‌లో మాత్రం జూన్ 9 న జరుగబోయే ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ చూడాలంటే ఆస్తులమ్ముకోవాలంటున్నారు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ..!
రాజకీయ కారణాలు, బోర్డర్ సమస్యలు, ఇతర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్ టీములు గత పదేళ్లుగా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ లు ఆడలేదు. దీంతో అప్పుడప్పుడూ జరిగే టీ 20 వరల్డ్ కప్, వరల్డ్ కప్ వంటి టోర్నమెంట్లలో ఈ రెండు టీముల మధ్య జరిగే మ్యాచులపై క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తి చూపుతారు. ఈ మ్యాచ్‌లపై వారి అంచనాలు సైతం తారా స్థాయిలో ఉంటాయి.
అయితే ఈ సారి టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా జూన్ 9న న్యూయార్క్ లోని నాసౌ కంట్రీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్నఇండియా, పాకిస్థాన్ బ్యాటిల్‌ని డైమండ్ క్లాస్ లో కూర్చొని చూడాలంటే మాత్రం ఒక్కో టికెట్టునూ రూ. 20 వేల డాలర్లు అంటే రూ.16.6 లక్షలకు కొనక తప్పదని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఆరోపించారు. ఐసీసీ వైఖరిపై ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.
ఈ మేరకు ఆయన X లో గురువారం ట్వీట్ చేశారు. ‘‘ టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు సంబంధించిన డైమండ్ క్లబ్ టికెట్లు ఒక్కో సీటుకు రూ. 20 వేల డాలర్లు చొప్పున ఐసీసీ అమ్ముతోందని తెలిసి షాకయ్యాను. యూ ఎస్ లో టీ 20 వరల్డ్ కప్ నిర్వహిస్తోంది ఆ దేశంలో క్రికెట్‌కు ఆదరణ పెరగాలని, క్రికెట్ అభిమానులను పెద్ద ఎత్తున ఎంగేజ్ చేయాలనే తప్ప గేట్ కలెక్షన్లలో లాభార్జన కోసం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. ఒక్కో సాధారణ టికెట్టుకూ 2,750 డాలర్లా..? అసల ఇది క్రికెట్టేనా.? ఐపీఎల్ రెండో సీజన్ కోసం నేను 2009లో సౌతాఫ్రికాలో 64 గేమ్స్ నిర్వహించడానికి 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే గేట్ మనీగా 5 మిలియన్ డాలర్లు మాత్రమే వెనక్కొచ్చాయి. క్రికెట్ పై ఆసక్తిని పెంచేందుకు, ఆటని జనంలోకి తీసుకెళ్లేందకు 2 నుంచి 15 డాలర్లకే మేము అప్పట్లో టిక్కెట్లు అమ్మాము. ఐపీఎల్ ని గ్రాండ్ సక్సెస్ చేసి చరిత్ర సృష్టించాం. ఇలాంటి వాటిని పరిగణనలోనికి తీసుకోవలి’’ అని సూచించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి ప్రతిష్టాత్మక లీగ్ కు ఫౌండర్ ఛైర్మన్ గా వ్యవహరించిన లలిత్ మోదీ మూడేళ్ల పాటు లీగ్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఆ తరువాత ఆయన పలు ఆరోపణలనెదుర్కొని ఇండియా వదిలి వెళ్లిపోయారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)