World Cup 2023: అప్పుడు ‘ధోనీ రివ్యూ సిస్టమ్’- ఇప్పుడు ‘డెసిషన్ రాహుల్ సిస్టమ్’
ODI World Cup 2023: ప్రపంచకప్ వంటి తీవ్ర ఒత్తిడితో కూడుకున్న టోర్నీల్లో బౌలర్లు ప్రతి బంతికి అప్పీల్ చేయడం పరిపాటే..
వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహతంగా దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా.. వరుసగా పదో విజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఇందులో వికెట్ల ముందు బ్యాటర్లు, బౌలర్లు ఎంత కీలకంగా వ్యవహరించారో.. వికెట్ల వెనుక నుంచి కీపర్ కేఎల్ రాహుల్ అంతకుమించి ప్రతిభ చూపాడు.
భారీ అంచనాల మధ్య సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు.. వాటిని నిలబెట్టుకుంటూ తుదిపోరుకు చేరింది. ఎప్పట్లాగే విరాట్ కోహ్లీ దుమ్మురేపుతూ ఈ మెగాటోర్నీలోనే కాకుండా.. ఓవరాల్‌గా ప్రపంచకప్‌ల చరిత్రలోనే ఒక ఎడిషన్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కగా.. హిట్‌మ్యాన్ రోహిత్ వర్మ, నాలుగో నంబర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా 500 పరుగుల మార్క్ అందుకున్నారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మెరుగైన ఆరంభాలతో ఆకట్టుకుంటుంటే.. మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్ జట్టుకు స్థిరత్వం తీసుకొస్తున్నాడు. బౌలింగ్‌లో మహమ్మద్ షమీ.. వీర విజృంభణ కొనసాగుతుంటే.. అతడికి జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అండగా నిలుస్తున్నారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ భారాన్ని మోస్తున్నారు. అంతా సవ్యంగానే ఉన్నా.. గత మెగాటోర్నీలో వికెట్ల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ మహేంద్ర సింగ్ ధోనీ అందుబాటులో లేకపోవడం పెద్ద లోటే అని టోర్నీ ఆరంభంలో అభిమానులు సైతం అనుకొని ఉంటారు. అయితే మహీని మరిపిస్తూ రాహుల్ రాణిస్తుండటం మేనేజ్‌మెంట్‌కు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది.
ఒకప్పుడు వికెట్ల వెనుక నుంచి ధోనీ అప్పీల్ చేశాడంటే.. అంపైర్ కూడా తన నిర్ణయంపై సందేహంలో పడిపోయేవాడు. మైదానంలో మహీ విలువ తెలిసిన వారికే ఈ విషయం అవగతం అవుతుంది. అంతర్జాతీయ క్రికెటలో డిసిషన్ రివ్యూ సిస్టం (డీఆర్‌ఎస్) ప్రవేశ పెట్టిన తర్వాత.. దాన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్న మహీ.. ఎన్నోసార్లు అంపైర్ల నిర్ణయాలు తప్పని తన అప్పీల్‌తో నిరూపించాడు. బంతి వికెట్లను తాకుతుందా లేదా, ప్యాడ్ కంటే ముందు బ్యాట్‌ను తాకిందా అని కనిపెట్టడంలో ధోనీని మించిన వారు లేరనే గుర్తింపు సాధించాడు. లెక్కకు మిక్కిలి సార్లు ధోనీ నిర్ణయం సరైందని తేలడంతో.. డిసిషన్ రివ్యూ సిస్టం కాస్తా ‘ధోనీ రివ్యూ సిస్టం’గా మారిపోయింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా మహీ ఓకే అంటేనే కెప్టెన్ రివ్యూ కోరే సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఆధునిక క్రికెట్‌లో వికెట్ల వెనుక నుంచి ఆటను చదవడంలో మాస్టర్‌గా ఎదిగిన ధోనీ.. ఈ సారి ప్రపంచకప్‌లో అందుబాటులో లేకపోవడంతో డీఆర్‌ఎస్ విషయంలో టీమ్‌ఇండియా వెనుకబడుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ.. మహీ వారసుడిగా నేనున్నానంటూ రాహుల్ నమ్మకాన్ని నిలబెట్టాడు.
ప్రపంచకప్ వంటి తీవ్ర ఒత్తిడితో కూడుకున్న టోర్నీల్లో బౌలర్లు ప్రతి బంతికి అప్పీల్ చేయడం పరిపాటే.. అలాంటప్పుడు కాస్త వికెట్ల ముందు దొరికిపోయినట్లు అనిపిస్తే చాలు.. రివ్యూ కోరమని కెప్టెన్‌పై ఒత్తిడి తెస్తుంటారు. భారత జట్టు విషయానికి వస్తే.. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఇలా పలుమార్లు రివ్యూ కోరాల్సిందిగా కెప్టెన్ రోహిత్‌ను అడిగారు. అయితే హిట్‌మ్యాన్ మాత్రం రాహుల్ ఒప్పుకుంటేనే థర్డ్ అంపైర్ వద్దకు వెళ్తానని స్పష్టం చేశాడంటే.. వికెట్ల వెనుక కేఎల్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ‘బౌలర్ జోష్‌లో ఉంటాడు. వికెట్ పడిందనే అనిపిస్తుంది. కానీ.. నేనైతే ముందు రాహుల్ వైపు చూస్తా. అతడు అంగీకరం తెలిపితేనే రివ్యూ తీసుకుంటా. ఎందుకంటే. ఒక ఇన్నింగ్స్‌లో ఉండేది రెండు రివ్యూలే. అవి కొన్ని సార్లు చాలా అవసరమవుతాయి. వాటిని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు’ అని రోహిత్ ఇటీవల అన్నాడు. దీంతో ధోనీ రివ్యూ సిస్టమ్ కాస్తా.. ‘డిసిషన్ రాహుల్ సిస్టమ్’గా మారిందంటూ.. సోషల్ మీడియాలో మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఇక కీపర్‌గానూ కండ్లు చెదిరే క్యాచ్‌లతో అలరిస్తున్న రాహుల్‌పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. మొత్తంగా మెగాటోర్నీలో ఆడిన 10 మ్యాచ్‌ల్లో 16 ఔట్లలో రాహుల్ భాగస్వామి అయ్యాడు. అందులో 15 క్యాచ్‌లు ఓ స్టంపింగ్ ఉంది.