Karun Nair: డెడ్ పిచ్‌పై బౌన్సర్‌లా లేచిన కరుణ్ నాయర్; ఇంగ్లాండ్ టెస్టుతో కమ్‌బ్యాక్!
Karun Nair: టీమిండియాలో చోటు లభించడం అంత చిన్న విషయం కాదు. ఒకసారి చోటు దక్కిన తర్వాత పోగొట్టుకుంటే మళ్లీ రీ ఎంట్రీ అసాధ్యమే అని చెప్పాలి. కానీ ఓ క్రికెటర్ అలా రీ ఎంట్రీ ఇచ్చాడు.

Karun Nair: కరుణ్ నాయర్... భారత క్రికెట్‌లో ఈ మధ్య బాగా వినిపించిన పేరు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఎంపికైనప్పటి నుంచి కూడా కరుణ్‌పై అందరూ దృష్టి పెట్టారు. ఇప్పుడు ఫైనల్ 11లో కూడా చోటు దక్కించుకోవడంతో అతని ఆటపై ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే అతను దాదాపు 8 ఏళ్ల తర్వాత టెస్ట్‌లు ఆడుతున్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఇది రీ డెబ్యూ లాంటిది.
డొమెస్టిక్ క్రికెట్‌లో కరుణ్ చూపించిన ఫామ్, ఇంగ్లాండ్‌లోని ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో చేసిన డబుల్ సెంచరీ టీమిండియా ఫైనల్ 11లో చోటు దక్కేలా చేసింది. వీటితోపాటు టీమ్‌లోని సీనియర్‌లు లేకపోవడంతో కూడా అతన్ని ఎంపిక ఈజీ అయ్యింది.
కరుణ్ నాయర్ కెరీర్ ప్రారంభం
కరుణ్ నాయర్ 2016లో టెస్ట్‌లకు అరంగేట్రం చేశాడు. అతని కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షణం ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో 303 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను భారత్‌కు రెండవ ట్రిపుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. కానీ, ఈ ఇన్నింగ్స్‌తో అతను టీమ్‌లో స్థిరంగా స్థానం సంపాదించుకోలేకపోయాడు. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచే అతని చివరి టెస్ట్‌గా మారింది. ఇన్నాళ్లకు ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడీ 33 ఏళ్ల ప్లేయర్.
ఇంగ్లాండ్‌తో ఈ సిరీస్ కరుణ్ నాయర్ కెరీర్‌కు చాలా కీలకం. మంచి కమ్‌బ్యాక్ అవుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అతన్ని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దించుతున్నారు. అతనిపై ఉన్న అంచనాలను మరింత పెంచేసేలా ప్రాక్టీస్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయడం మొదటి టెస్టులో ప్లేయింగ్ లెవ్‌లో స్థానంభించేలా చేసింది.
కరుణ్ నాయర్‌కు టీమ్‌లో కెఎల్ రాహుల్‌తో మంచిస్నేహం ఉంది. ఇద్దరు 11 సంవత్సరాల వయస్సు నుంచి కలిసి క్రికెట్ ఆడుతున్నారు. ఇద్దరూ 33 ఏళ్ల వయసులో ఉన్నారు. ఈ సిరీస్‌కు ముందు కెఎల్ రాహుల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... “మేము ఇద్దరం చాలా కాలం భారత్‌కు కలిసి ఆడాలని కోరుకుంటున్నాం. కరూన్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఫార్మ్‌తో టీమ్‌లోకి వచ్చాడు. ఎలాగైనా టీమ్‌లోకి తిరిగి రావాలనే తపనతో రాణించాడు. అనుకున్నది సాధించాడని అని చెప్పాడు.
కరుణ్ నాయర్‌కు ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయమవడంతో మొదటి మ్యాచ్‌కు అందులో ఉంటాడోలేడో అని అనుకున్నారు కానీ చివరకు ప్లెయింగ్ 11లో స్థానం సంపాదించుకున్నాడు. కరుణ్ నాయర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో బంతి రిబ్స్‌కు తగిలింది. దీంతో బాధతో విలవిలలాడిపోయాడు. కానీ కాసేపటికే మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఘటన తన ఫిట్నెస్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. కరుణ్‌తో బ్యాటింగ్ కోచ్ ప్రత్యేకంగా మాట్లాడి స్టాన్స్, టెక్నిక్‌లో మార్పులు గురించి సూచనలు చేశాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ కొంత మెరుగైనట్టు కనిపించింది.
మాజీ భారత బ్యాట్స్మన్ ముహమ్మద్ కైఫ్ కరుణ్ నాయర్ పునరాగమనాన్ని సపోర్ట్ చేశాడు. “కరూన్ నాయర్ ద్రవిడ్, లక్ష్మణ్, పుజారా వంటి బ్యాట్స్‌మెన్ స్థాయిలో ఆడగలడు. అతను రంజీలో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇంగ్లాండ్‌లో టెస్ట్‌లు ఆడేటప్పుడు ఈ టైప్ బ్యాట్స్మన్‌కు ఎంతో అవసరం” అని కైఫ్ అభిప్రాయపడ్డారు.
“ఇంగ్లాండ్‌లో టెస్ట్‌లు ఆడేటప్పుడు, బ్యాట్స్మన్ ఒక్కరోజు పూర్తిగా బ్యాటింగ్ చేయగలిగితే టీమ్‌కు మంచిది. కరుణ్ నాయర్‌లో ఈ సామర్థ్యం ఉంది. అతను గ్రౌండ్ షాట్స్‌తో పరుగులు సాధించగలడు. ఇంగ్లాండ్‌లోని పిచ్‌లు సీమ్, స్వింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరుణ్ నాయర్ టైప్ బ్యాట్స్మన్‌కు ఎంతో అవసరం” అని కైఫ్ అభిప్రాయపడ్డారు.




















