IRE Vs IND: రెండో టీ20లో భారత్ ఘనవిజయం - సిరీస్ కూడా మనదే!
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 33 పరుగులతో ఘనవిజయం సాధించింది.
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 33 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను కూడా 2-0తో సొంతం చేసుకుంది.
టీమిండియా బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (58: 43 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ (40: 26 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), రింకూ సింగ్ (38: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) కూడా రాణించారు. ఐర్లాండ్ బ్యాటర్లలో ఆండ్రూ బాల్‌బిర్నీ (72: 51 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.
బాల్‌బిర్నీ వన్ మ్యాన్ షో...
186 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను క్రీజులో కుదురుకోనివ్వలేదు. ప్రసీద కృష్ణ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో పాల్ స్టిర్లింగ్ (0: 4 బంతుల్లో), లోర్కాన్ టక్కర్‌లను (0: 3 బంతుల్లో) అవుట్ చేసి ఐర్లాండ్‌ను తొలి దెబ్బ కొట్టాడు. దీంతో ఐర్లాండ్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత కూడా ఆండ్రూ బాల్‌బిర్నీ (72: 51 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) తప్ప ఇంకెవరూ పోరాటపటిమ ప్రదర్శించలేదు. మరే ఆటగాడూ కనీసం 25 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో ఐర్లాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసీద్ కృష్ణ, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్‌కు ఒక వికెట్ దక్కింది.
ఆఖర్లో ఊపేశారు...
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. వేగంగా ఆడే క్రమంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18: 11 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), తిలక్ వర్మ (1: 2 బంతుల్లో) పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత్ 34 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. మొదట మెల్లగా ఆడిన వీరు తర్వాత గేర్లు మార్చారు. రుతురాజ్ గైక్వాడ్, సంజు శామ్సన్ ఇద్దరూ అడపాదడపా బౌండరీలు కొడుతూ రన్‌రేట్ పడిపోకుండా చూశారు.
మూడో వికెట్‌కు వీరిద్దరూ 69 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరి జోడీ బలపడుతున్న దశలో సంజు శామ్సన్‌ను అవుట్ చేసి బెంజమిన్ వైట్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కాసేపటికే రుతురాజ్ గైక్వాడ్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 బంతుల్లో రుతురాజ్ అర్థ సెంచరీ సాధించాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బ్యారీ మెకార్తీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టాడు.
అక్కడి నుంచి ఐపీఎల్ హీరోలు రింకూ సింగ్, శివం దూబే (22 నాటౌట్: 16 బంతుల్లో, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్లారు. సిక్సర్లతో చెలరేగారు. కేవలం 28 బంతుల్లోనే ఐదో వికెట్‌కు 55 పరుగుల కీలకమైన, వేగవంతమైన భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెకార్తీ రెండు వికెట్లు పడగొట్టాడు. మార్క్ అడెయిర్, క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్‌లకు తలో వికెట్ దక్కింది.