MI vs RCB, Match Highlights: టార్గెట్ 200 ఉఫ్ - భారీ లక్ష్యాన్ని అవలీలగా దంచేసిన ముంబై - టాప్-3కి చేరిన రోహిత్ సేన
MI vs RCB: ఆర్సీబీ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై.. 16,3 ఓవర్లలోనే ఛే‘దంచేసింది’. ఈ సీజన్ లో 200, అంతకుమించి టార్గెట్‌ను ఛేదించడం ముంబైకి ఇది మూడోసారి కావడం గమనార్హం.
IPL 2023, MI vs RCB: టార్గెట్ రెండు వందలా..? ఇది మాకు చాలా చిన్న విషయం అంటోంది ముంబై ఇండియన్స్. వాంఖెడే వేదికగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముగిసిన 54వ లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై.. 16,3 ఓవర్లలోనే ఛే‘దంచేసింది’. ఈ సీజన్ లో 200, అంతకుమించి టార్గెట్‌ను ఛేదించడం ముంబైకి ఇది మూడోసారి కావడం గమనార్హం. భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆటగాడు, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 83, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) కు తోడుగా నెహల్ వధేర (34 బంతుల్లో 52 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో ఆర్సీబీ లక్ష్యం చిన్నబోయింది. బెంగళూరుపై ముంబై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుని ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
200 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 42, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉన్నది కొద్దిసేపే అయినా వీరబాదుడు బాదాడు. 4.4 ఓవర్లలోనే ముంబై స్కోరు అర్థ సెంచరీ దాటింది. అయితే స్వల్ప వ్యవధిలోనే ఇషాన్ తో పాటు రోహిత్ శర్మ (7) లను హసరంగ ఔట్ చేశాడు. రోహిత్ మరోసారి నిరాశపరిచాడు.
‘సూర్య’ ప్రతాపం..
52 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్య.. నెహల్ తో కలిసి ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఆది నుంచే ముంబై బౌలర్లపై ఈ ఇద్దరూ ఎదురుదాడికి దిగారు. ఫలితంగా 10 ఓవర్లలోనే ముంబై స్కోరు వంద పరుగులకి చేరింది. సిరాజ్, హర్షల్ పటేల్, హెజిల్వుడ్, హసరంగ, వైశాఖ్.. బౌలర్లు మారినా బంతి మాత్రం మినిమం బౌండరీ లైన్ ఆవలే ఉంది.
11వ ఓవర్ దాకా వికెట్ కాపాడుకుంటూ కాస్త పద్ధతిగా బాదిన సూర్యా భాయ్.. ఆ తర్వాత ఆగలేదు. ఆర్సీబీ బౌలర్లను నాటు కొట్టుడు కొట్టాడు. సిరాజ్ వేసిన 14 వ ఓవర్లో 4, 6 కొట్టి 26 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఇక హసరంగ వేసిన మరుసటి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు. ఇదే ఓవర్లో వధేరా రెండు ఫోర్లు బాదాడు. 15 ఓవర్లకే ముంబై స్కోరు 174 పరుగులకు చేరింది.
𝗦 on krypton stands for hope, but on earth 🌍 it stands for 𝙎𝙐𝙍𝙔𝘼 𝘿𝘼𝘿𝘼 𝘾𝙃𝘼 𝙑𝘼𝘼𝘿𝘼 🫡#OneFamily #MIvRCB #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 @surya_14kumar pic.twitter.com/OthOyi6uYf
— Mumbai Indians (@mipaltan) May 9, 2023
విజయ్ కుమార్ వేసిన 16వ ఓవర్లో సూర్య 6,4,6 కొట్టి ముంబైని విజయం ముంగిటకు తీసుకొచ్చాడు. కానీ ఇదే ఓవర్లో నాలుగో బాల్‌కు భారీ షాట్ ఆడబోయి కేదార్ జాదవ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సూర్యకు ఐపీఎల్ లో ఇదే హయ్యస్ట్ స్కోరు కావడం గమనార్హం. సూర్య నిష్క్రమించిన వెంటనే టిమ్ డేవిడ్ (0) కూడా ఔట్ అయినా గ్రీన్ (2 నాటౌట్), వధేరలు మిగతా పనిని పూర్తి చేశారు.
అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ.. 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (33 బంతుల్లో 68, 8 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (41 బంతుల్లో 65, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) లతో పాటు చివర్లో దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు.