IPL 2023: అమ్మో ఏప్రిల్ 23 - ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఈ తేదీ అంటే వణుకు - మళ్లీ అదే రిపీట్ కాదుగా!
RCB vs RR: ఐపీఎల్ లో మోస్ట్ ఫ్యాన్ బేస్డ్ టీమ్ గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఏప్రిల్ 23కు మరిచిపోలేని, మరల రాకూడని జ్ఞాపకాలున్నాయి.
IPL 2023, RCB vs RR: ఐపీఎల్ - 16లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత గ్రౌండ్ లో రాజస్తాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడుతారు..? అన్న సంగతి పక్కనబెడితే ఆర్సీబీకి ఈ తేదీతో మరిచిపోలేని, మరల రాకూడని జ్ఞాపకాలున్నాయి. ‘హుర్రే..! ఇవాళ ఏప్రిల్ 23 అని ఎగిరి గంతేసే లోపే.. వామ్మో ఇవాళ ఏప్రిల్ 23’ అని వణికిపోయే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
అత్యధిక స్కోరు నమ్దే..
ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు చేసిన టీమ్‌గా ఆర్సీబీకి ఘనమైన రికార్డు ఉంది. 2013లో ఏప్రిల్ 23న పూణె వారియర్స్‌పై ఆర్సీబీ బ్యాటర్లు వీరవిహారం చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేశారు. కరేబియన్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ ఈ మ్యాచ్ లోనే 66 బంతుల్లో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్ లో ఎన్నో రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. మరెన్నో కొత్తవి పుట్టుకొస్తున్నాయి. కానీ గేల్ చేసిన 175 పరుగుల రికార్డు మాత్రం పదేండ్లుగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది.
అత్యల్ప స్కోరూ నమ్దే..
ఈ లీగ్‌లో అత్యధిక స్కోరుతో పాటు అత్యల్ప స్కోరు చేసిన చెత్త రికార్డు కూడా ఆర్సీబీకే ఉంది. 2017లో ఇదే ఏప్రిల్ 23న కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తో ఆర్సీబీ తలపడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 131 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ సేన 9.4 ఓవర్లలో 49 పరుగులకు చాపచుట్టేసింది. ఇదే క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లు పట్టుమని పది నిమిషాలు క్రీజులో ఉండలేకపోయారు. కోహ్లీ డకౌట్. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. కేదార్ జాదవ్ 9 పరుగులతో టాప్ స్కోరర్.
RCB on 23rd April in IPL history since 2013:
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 23, 2023
2013 - 263/5 Vs PWI.
2017 - 49/10 Vs KKR.
2022 - 68/10 Vs SRH.
- IPL highest and lowest total both came on 23rd April by RCB. pic.twitter.com/mmXrizRZeL
గతేడాదీ అదే కథ..
2022 సీజన్ లో కూడా ఆర్సీబీకి మరోసారి ఇదే తేదీన సన్ రైజర్స్ షాకిచ్చింది. ఐపీఎల్ -15 సీజన్ 36వ లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ.. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 16.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ లో అత్యల్ప స్కోరు చేసిన జట్లలో ఆర్సీబీ ఫస్ట్ తో పాటు ఆరో స్థానంలో నిలవడానికి ఈ మ్యాచే కారణం. ఈ మ్యాచ్ లో కూడా కోహ్లీ డకౌట్ అయ్యాడు. టాప్ స్కోరర్ ప్రభుదేశాయ్ (15).
ఇప్పుడూ అదే రిపీట్ అయితే..!
ఏప్రిల్ 23 అంటేనే వణికిపోయే ఆర్సీబీ అభిమానులు నేటి మ్యాచ్ లో కూడా అదే జరుగుతుందా..? అని ఆందోళన చెందుతున్నారు. అసలే ప్రత్యర్థి రాజస్తాన్ రాయల్స్. ట్రెంట్ బౌల్ట్ కసిమీద ఉన్నాడు. మ్యాచ్ గెలిచినా ఓడినా ఫర్లేదు గానీ మరోసారి తమను ఆర్సీబీ భయపెట్టకుండే అదే పదివేలు అని ఆ జట్టు అభిమానులు కోరుకుంటన్నారు. కానీ అక్కడున్నది ఆర్సీబీ..!
April 23 - the most remarkable day in #RCB history pic.twitter.com/DNW8ovnHIJ
— ESPNcricinfo (@ESPNcricinfo) April 23, 2021