మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు - ఐపీఎల్ ఆడే ప్లేయర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు
IPL 2023 Covid Rules: ఈ నెల చివరి వారంలో మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16వ సీజన్ కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
IPL 2023 Covid Rules: సుమారు మూడేండ్ల తర్వాత ఐపీఎల్‌లో మళ్లీ హోం అండ్ అవే (ఇంటా బయటా) మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ఇదివరకే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ సీజన్ లో గత మూడేండ్ల మాదిరిగా కాకుండా ఈసారి తమ అభిమాన క్రికెటర్ల ఆటను తమ సొంత నగరాల్లోనే చూసుకోవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతా అనుకున్నట్టు జరుగుతున్న తరుణంలో దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఐపీఎల్ ఆడబోయే ఆటగాళ్ల (ఫ్రాంచైజీ) కు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
గత వారం పది రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల, H3N2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసుల కలకలంతో బీసీసీఐ అప్రమత్తమైంది. కోవిడ్ - 19 సోకిన క్రికెటర్ ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాల్సిందేనని ఫ్రాంచైజీలను ఆదేశించినట్టు పలు జాతీయ ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. గతేడాది మాదిరిగానే కరోనా సోకిన క్రికెటర్లు ఏడు రోజుల పాటు క్వారంటైన కావల్సిందేనని ఆయా మేనేజమెంట్ లకు సూచించిందని తెలుస్తున్నది.
అయితే ఈ సీజన్ లో కేవలం ఐసోలేషన్ మేరకే సరిపెట్టిన బీసీసీఐ.. 2020, 2021 లలో మాదిరిగా బయో బబుల్ లో ఆడించేది లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇదే విషయమై ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తో బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘భారత్ తో కరోనా, ఇన్‌ఫ్లుయెంజా కేసుల కలకలంతో మేం కూడా అప్రమత్తంగా ఉన్నాం. పాజిటివ్ సోకినా లేక లక్షణాలున్న క్రికెటర్లు ఏడు రోజులు ఐసోలేట్ కావాల్సిందే. ఈ సీజన్ లో పాజిటివ్ వచ్చిన క్రికెటర్లను మ్యాచ్ లు ఆడేందుకు అనుమతించబోం..’అని తెలిపాడు. ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తికి ఐదో రోజు తర్వాత మరోసారి టెస్టు చేసి నెగిటివ్ అని తేలితేనే సీజన్ ఆడించనున్నారు.
అలా కాకుండా...
ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి కరోనా వల్ల 2020 ఐపీఎల్ ను అత్యంత జాగ్రత్తల నడుమ కఠిన బయో బబుల్స్ లో నిర్వహించింది బీసీసీఐ. కానీ సీజన్ సగం కూడా ముగియకముందే పలు ఫ్రాంచైజీల ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఐపీఎల్ ను అర్థాంతరంగా రద్దు చేసింది. కానీ 2021, 2022లో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడింది. ఇక ఇప్పుడు 2019 తర్వాత మళ్లీ హోం అండ్ అవే సిస్టమ్ ను తీసుకొస్తున్న బీసీసీఐ.. కేసుల పెరుగుదల వల్ల ఐపీఎల్ ను నిలిపేసే దుస్థితికి రాకుండా చర్యలు తీసుకుంటున్నది. మార్చి 31 నుంచి ఐపీఎల్-16 మొదలుకానున్నది.
వచ్చినా ఆడించారు..
కరోనా ఒక ఊపు ఊపిన రెండేండ్లు ఆ వైరస్ సోకిన ఆటగాళ్లను ఆట ఆడించలేదు. కానీ ఈ వైరస్ ఉధృతి తగ్గిన తర్వాత పలు నిబంధనలను సడలించారు. కరోనా పాజిటివ్ గా తేలినా కూడా క్రికెట్ ఆడించారు. ఇలా ఆడిన తొలి క్రికెటర్ ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో యూపీ వారియర్స్ తరఫున ఆడుతున్న ఆసీస్ క్రికెటర్ తహీలా మెక్‌గ్రాత్. గతేడాది కామన్వెల్త్ క్రీడలలో భాగంగా భారత్ తో మ్యాచ్ లో ఆమె ఆడింది. మెక్‌గ్రాత్ తర్వాత మాథ్యూ వేడ్, రెన్షాలు కూడా పాజిటివ్ అని తేలినా మ్యాచ్ లు ఆడారు.