IPL 2022, Qualifier 1 Preview: ఫైనల్స్ మొదటి బెర్త్ ఎవరిది? - టైటాన్స్, రాయల్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి?
ఐపీఎల్‌లో మంగళవారం జరగనున్న క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి.
ఐపీఎల్ 2022లో లీగ్ దశ ముగిసింది. ఎంటర్‌టైన్‌మెంట్ వేరే లెవల్‌కు చేరనుంది. ఇకపై జరగనున్న నాలుగు మ్యాచ్‌లే విజేతను నిర్ణయించనున్నాయి. వీటిలో మొదట క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుంది. కాబట్టి గెలవడానికి రెండు జట్లూ సర్వశక్తులూ పెట్టి పోరాడనున్నాయి.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు పోరు ప్రారంభం కానుంది. ఈ వేదికపై చివరిగా జరిగిన ఐదు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మూడు సార్లు ఛేజింగ్ చేసిన జట్టే గెలుపొందింది. పిచ్‌పై పేస్, బౌన్స్ ఎక్కువగా ఉండనుంది.
గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ఈ సీజన్‌లో ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్, రాజస్తాన్‌ను 37 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (87: 52 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితం అయింది. జోస్ బట్లర్ (54: 24 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేదు.
ఈ రెండు జట్ల మధ్య గుజరాత్ కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభాన్ని ఇస్తున్నారు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. డేవిడ్ మిల్లర్ చివర్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. మహ్మద్ షమీ, రషీద్ ఖాన్‌లు బౌలింగ్‌లో కీలకం కానున్నారు.
ఇక రాజస్తాన్ రాయల్స్ గేమ్ టేబుల్ టాపర్స్‌ను కొట్టాలంటే అద్భుతంగా ఆడాల్సిందే. మొదటి ఏడు మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపించిన జోస్ బట్లర్ తర్వాత ఫాం కోల్పోయాడు. యశస్వి జైస్వాల్, సంజు శామ్సన్, దేవ్‌దత్ పడిక్కల్‌లో టాప్ఆర్డర్‌లో మెరుపులు మెరిపించాలి. రవిచంద్రన్ అశ్విన్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. యుజ్వేంద్ర చాహల్ పర్పుల్ క్యాప్ దక్కించుకుని వికెట్ల వేటలో దూసుకుపోతున్నాడు. ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ కృష్ణ పరుగులను కట్టడి చేస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు (అంచనా)
వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, లోకీ ఫెర్గూసన్, యష్ దయాళ్, మహ్మద్ షమీ
రాజస్తాన్ రాయల్స్ తుదిజట్టు (అంచనా)
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శామ్సన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మేయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెకాయ్