ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత సీనియర్ క్రికెటర్ జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు లభించింది. తన చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియాపై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలిచిన తీరు కాస్త వివాదాస్పదం అయినప్పటికీ నిబంధనలకు అతీతం మాత్రం కాదు. దీంతోపాటు ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌ను 3-0తో వైట్ వాష్ చేయడం విశేషం.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు. కేవలం 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్మృతి మంథన, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ మినహా ఎవరూ కనీసం ఐదు పరుగులు కూడా చేయలేకపోయారు. మరోవైపు ఇంగ్లండ్ బౌలర్లు కూడా వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో సరైన భాగస్వామ్యం ఒక్కటి కూడా నమోదు కాలేదు.
స్మృతి మంథన, దీప్తి శర్మలు ఐదో వికెట్‌కు జోడించిన 58 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్‌కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కాయి. ఫ్రేయా కెంప్, ఎకిల్‌స్టోన్ రెండేసి వికెట్లు, షార్లొట్ డీన్, ఎఫ్ డేవిస్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కూడా సాఫీగా ఏమీ సాగలేదు. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 65 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత తొమ్మిదో నంబర్ బ్యాటర్ షార్లొట్ డీన్ పోరాటం చేసింది. టెయిలెండర్లతో కలిసి చిన్న భాగస్వామ్యాలు ఏర్పరచింది.
118 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ఓటమి తథ్యం అని అందరూ భావించారు. అయితే చివరి బ్యాటర్ ఫ్రేయా డేవిస్‌తో కలిసి డీన్ పోరాడింది. విజయానికి 17 పరుగులు అవసరమైన దశలో దీప్తి శర్మ మన్కడింగ్ ద్వారా డీన్‌ను అవుట్ చేసింది. దీంతో టీమిండియా 16 పరుగులతో విజయం సాధించింది. దీప్తి శర్మ మన్కడింగ్ ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. కానీ నిబంధనలకు అనుగుణంగానే జరిగింది కాబట్టి ఎటువంటి తప్పూ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram
View this post on Instagram