ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు రజత పతకాన్ని సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు రజతంతో ముగించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది.
తడబడి పుంజుకున్న ఆస్ట్రేలియా
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ అలీసా హీలీని (7: 12 బంతుత్లో, ఒక ఫోర్) రేణుకా సింగ్ స్కోరు బోర్డుపై తొమ్మిది పరుగులు చేరగానే పెవిలియన్‌కు పంపించింది. ఆ తర్వాత మరో ఓపెనర్ బెత్ మూనీ (61: 41 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్‌లు (36: 26 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించారు.
అయితే మెగ్ లానింగ్, టహీలా మెక్‌గ్రాత్ (2: 4 బంతుల్లో) కేవలం ఆరు బంతుల వ్యవధిలోనే అవుటయ్యారు. ఈ దశలోనే బెత్ మూనీ అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. చివర్లో యాష్లే గార్డ్‌నర్ (25: 15 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), రేచెల్ హేన్స్ (18: 10 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా ఆడారు. అయితే భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 161 పరుగులకు పరిమితం అయింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, రేణుకా సింగ్ రెండేసి వికెట్లు తీయగా... దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఆఖర్లో తడబడ్డ టీమిండియా
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ కూడా అంత సాఫీగా మొదలవలేదు. స్కోరు బోర్డు పైన 22 పరుగులు చేరేసరికి ఓపెనర్లు షెఫాలీ వర్మ (11: 7 బంతుల్లో, రెండు ఫోర్లు), స్మృతి మంథన (6: 7 బంతుల్లో, ఒక ఫోర్)అవుటయ్యారు. అయితే వన్ డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్జ్ (33: 33 బంతుల్లో, మూడు ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (65: 43 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ టీమిండియా వైపే ఉంది. అయితే మూడు పరుగుల వ్యవధిలో వీరిద్దరితో పాటు పూజా వస్త్రాకర్ (2: 5 బంతుల్లో) కూడా అవుట్ కావడంతో తర్వాతి బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది.
వారెవరూ రాణించకపోవడంతో లక్ష్యానికి కేవలం తొమ్మిది పరుగుల ముంగిట భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్లే గార్డ్‌నర్ మూడు వికెట్లు దక్కించుకుంది. మెగాన్ షుట్‌కు రెండు వికెట్లు పడ్డాయి. డార్సీ బ్రౌన్, జెస్ జొనాసన్ చెరో వికెట్ తీశారు. దీంతో భారత్ రజతంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.