SA v IND: టెస్ట్ కీపింగ్ బాధ్యతలు రాహుల్‌కే,బెంచ్‌కే పరిమితం కానున్న భరత్
SA v IND: రేపటినుంచి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆరంభించనుంది. సెంచూరియన్ వేదికగా జరగాల్సి ఉన్న తొలి టెస్టు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న టీమిండియా.. ఫైనల్ లెవన్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది.
భారత్-దక్షిణాఫ్రికా(India Vs South Africa) మధ్య బాక్సింగ్ డే టెస్టుకు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. టీమిండియా(Team India) స్టార్ బ్యాటర్లు చాలాకాలం తర్వాత సుదీర్ఘ ఫార్మట్‌లో బరిలోకి దిగనుడడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాయం కారణంగా చాలా కాలంగా టెస్టులు ఆడని జస్ప్రీత్ బుమ్రా కూడా టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలుపొందడం భారత్‌కు చాలా కీలకం. అయితే.. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు ఇంత వరకు టెస్టు సిరీస్ గెలవలేదు. ఈ సారి అయిన అందని ద్రాక్షగా ఉన్న సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
రేపటి(మంగళవారం) నుంచి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆరంభించనుంది. సెంచూరియన్(Centurion) వేదికగా జరగాల్సి ఉన్న తొలి టెస్టు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న టీమిండియా.. ఫైనల్ లెవన్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే స్పెషలిస్టు వికెట్ కీపర్‌గా కెఎస్ భరత్ ఉన్నా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్‌కే ఆ బాధ్యతలను అప్పజెప్పుతోంది. ఈ విషయాన్ని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు.
తొలి టెస్టు ఆరంభానికి ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వికెట్ కీపర్‌పై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. ఈ సిరీస్‌లో కెఎల్ రాహులే వికెట్ కీపర్‌గా ఉంటాడని స్పష్టం చేశాడు. టెస్టుల్లో రాహుల్ కీపింగ్ చేయడం ఇదే తొలిసారి. టెస్టు సిరీస్‌కు ముందే ఈ విషయాన్ని తాము రాహుల్‌తో చర్చించామని, అందుకు అతడు కూడా అంగీకరించాడని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. టెస్టు ఫార్మాట్‌లో వికెట్ కీపింగ్‌పై కేఎల్ రాహుల్ నమ్మకంగా ఉన్నాడని ద్రవిడ్ అన్నాడు. టెస్టు ఫార్మాట్‌లో వికెట్ కీపింగ్ సవాల్ అని... దాన్ని స్వీకరించేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు. అయిదు ఆరు నెలలుగా భారత జట్టులో రాహుల్ వరుసగా కీపింగ్ చేస్తున్నాడని గుర్తు చేసిన ద్రావిడ్. ఈ టెస్టుల్లోనూ అతడినే ఎంపిక చేసే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలిపాడు.
అనుమానాలకు చెక్ పెడుతూ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ... దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. వచ్చి రావడంతోనే మైదానంలో చెమట చిందించాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లీ ఇటీవలే ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ అని చెప్పి తిరిగి స్వదేశానికి వచ్చాడు. ప్రత్యేకించి కారణం తెలియకపోయినా కోహ్లీ ఉన్నఫళంగా భారత్‌కు రావడం అనుమానాలకు తావిచ్చింది. అయితే సఫారీ జట్టుతో ఈనెల 26 నుంచి మొదలుకాబోయే తొలి టెస్టు నాటికి అతడు అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ మళ్లీ దక్షిణాఫ్రికాతో జట్టును కలిసిన కోహ్లీ... ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. ప్రపంచకప్ తర్వాత మూడు వారాలు విశ్రాంతి తీసుకున్న రోహిత్ కూడా ప్రాక్టీస్ ప్రారంభించాడు. కోహ్లీ, రోహిత్ నెట్స్‌లో చెమటోడ్చారు. ఇద్దరూ బ్యాటింగ్ సాధనపైనే దృష్టిసారించారు. మూడు గంటల పాటు సాగిన సాధనను చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షించాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయగా.. యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్ స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇక పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో నాలుగో బౌలర్‌గా శార్దూల్ ఠాకూర్‌ను ఆడించే అవకాశముంది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెంచ్‌కే పరిమితం కావొచ్చు.