Inzamam-ul-Haq on Kohli: విరాట్ కోహ్లీపై ఇంజీ కామెంట్స్! పంత్‌ను తీసేయడంపై విమర్శ!
Asia Cup 2022: దాయాదుల పోరులో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆత్మవిశ్వాసంతో కనిపించలేదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ అంటున్నాడు.
Asia Cup 2022: దాయాదుల పోరులో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆత్మవిశ్వాసంతో కనిపించలేదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ అంటున్నాడు. క్రీజులో నిలదొక్కుకున్నా అతడు ఒత్తిడికి లోనయ్యాడని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా మిడిలార్డర్‌లో రిషభ్ పంత్‌ను (Rishabh Pant) తొలగించడం ఆశ్చర్యం కలిగించిందని వెల్లడించాడు. తన యూట్యూబ్ ఛానళ్లో ఇంజీ మాట్లాడాడు.
పేలవ క్యాచ్‌తో
పాకిస్థాన్‌తో మ్యాచులో విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు. వాస్తవంగా అతడు డకౌట్ అవ్వాల్సింది. యువ పేసర్ నసీమ్ షా వేసిన బంతికి అతడు స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. అయితే ఫకర్ జమాన్ బంతి వదిలేయడంతో బతికిపోయాడు. అయితే లెగ్ స్పిన్నర్ల బలహీనత అతడిని వెంటాడింది. రోహిత్ శర్మ తరహాలోనే అనవసర షాట్ ఆడి ఔటయ్యాడు.
ఆత్మవిశ్వాస లేమి
'పాక్ మ్యాచులో విరాట్ కోహ్లీపై విపరీతమైన ఒత్తిడి కనిపించింది. సాధారణంగా నిలదొక్కుకున్న బ్యాటర్‌ను ఔట్ చేయడం కష్టం. విచిత్రంగా క్రీజులో నిలిచాకా విరాట్ కోహ్లీ ఆత్మవిశ్వాసంతో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది' అని ఇంజమామ్ అన్నాడు.
పంత్‌కు చోటు లేదా!
తొలి ప్రాధాన్య వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు తుది జట్టులో చోటివ్వకపోవడంపై ఇంజీ ప్రశ్నించాడు. అతడిని తొలగించడం విచిత్రంగా అనిపించిందన్నాడు. 'సాధారణంగా టీమ్‌ఇండియా మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్ పటిష్ఠంగా ఉంటుంది. ఆసియాకప్‌లో మిగతా జట్లతో భారత్‌ను వేరు చేసిది అదే. అయితే రిషభ్ పంత్‌ను బెంచీపై కూర్చోబెట్టడం నన్ను ఆశ్చర్యపరిచింది. పంత్, జడ్డూ, పాండ్యతో కూడిన కూర్పు అత్యంత ప్రమాదకరం. ఈ పిచ్‌పై ఓవర్‌కు 11 పరుగుల్ని ఛేదించడం కష్టమే. కానీ హిట్‌మ్యాన్ సేన అద్భుతంగా ఆడింది' అని ఇంజీ ప్రశంసించాడు.
సత్తా లేని మిడిలార్డర్
ఇప్పటికైనా నాలుగు, ఐదు స్థానాల్లో స్పెషలిస్టు బ్యాటర్లను గుర్తించాలని పాక్ సెలక్షన్ కమిటీకి ఇంజీ సూచించాడు. మిడిలార్డర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని కోరాడు. మూడో స్థానంలో ఫకర్ జమాన్ ఔటైతే జట్టంతా కుప్పకూలుతోందని వెల్లడించాడు. అందుకే నాలుగు, ఐదు స్థానాల్లో మంచి బ్యాటర్లను ఎంపిక చేయాలని కోరాడు. అసిఫ్ అలీ, కుష్ దిల్‌షా లోయర్ మిడిలార్డర్లో నప్పుతారని వివరించాడు.
భారత్, పాక్ మ్యాచ్ రిజల్ట్
చిరకాల ప్రత్యర్థిపై టీమిండియా పంజా విసిరింది. ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 147 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం టీమిండియా 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసియా కప్‌లో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడనుంది. ఆగస్టు 31వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 4వ తేదీన జరిగే సూపర్-4 మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ మళ్లీ తలపడనున్నాయి.
The match may be over but moments like these shine bright ✨👌
— BCCI (@BCCI) August 29, 2022
A heartwarming gesture by @imVkohli as he hands over a signed jersey to Pakistan's Haris Rauf post the #INDvPAK game 👏👏#TeamIndia | #AsiaCup2022 pic.twitter.com/3qqejMKHjG