By: ABP Desam | Updated at : 04 Dec 2022 09:14 AM (IST)
Edited By: nagavarapu
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (source: twitter)
IND vs BAN 1st ODI: టీమిండియా నేటి నుంచి బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. బంగ్లాకు లిటన్ దాస్ కెప్టెన్సీ చేయనున్నాడు.
న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న సీనియర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు ఈ సిరీస్ కు అందుబాటులోకి వచ్చారు. అలానే బంగ్లాతో వన్డే మ్యాచులకు టీం మేనేజ్ మెంట్ కొత్త కుర్రాళ్లకు అవకాశమిచ్చింది. రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, కుల్దీప్ సేన్ లాంటి ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు. సీనియర్లు, కుర్రాళ్ల మేళవింపుతో భారత్ కాగితంమీద బలంగా కనిపిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ నకు సన్నాహకంగా ఈ మ్యాచులను ఉపయోగించుకోనున్నారు. మరి అందులో ఎంతమేర సఫలీకృతమవుతారో చూడాలి.
ఓపెనింగ్ వారిద్దరేనా!
బంగ్లాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. టెస్టులు, టీ20లు ఆడని ధావన్ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. రానున్న ప్రపంచకప్ లో అతను కీలకం కానున్నాడు. కివీస్ పర్యటనలో ఓ మోస్తరుగా రాణించిన ధావన్.. ఈ సిరీస్ లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. పోటీగా కుర్రాళ్లు సిద్ధంగా ఉన్న తరుణంలో శిఖర్ మరింతగా రాణించాల్సిన అవసరముంది. వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ దిగడం ఖాయమే. నాలుగో స్థానంలో న్యూజిలాండ్ సిరీస్ లో రాణించిన శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అయితే రాహుల్ ను ఆడించాలనుకుంటే అయ్యర్ ను పక్కన పెట్టాల్సిందే. ఆల్ రౌండర్ల కోటాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లు ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.
భారత్ కు పంత్ 'బెంగ'
టీమిండియాను వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇతనికి ఎన్ని అవకాశాలిచ్చినా ఉపయోగించుకోలేక పోతున్నాడు. తాజాగా కివీస్ పర్యటనలోనూ దారుణంగా విఫలమయ్యాడు. అయినప్పటికీ పంత్ గత రికార్డులు దృష్టిలో పెట్టుకుని జట్టు యాజమాన్యం, కోచ్, కెప్టెన్ మద్దతుగా నిలుస్తున్నారు. అయితే పంత్ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. పేలవ షాట్ లతో పెవిలియన్ చేరుతున్నాడు. అయినా అతనిపై మరోసారి నమ్మకముంచి బంగ్లాతో సిరీస్ కు ఎంపిక చేశారు. ఇందులో అయినా రిషభ్ రాణిస్తాడో ఎప్పటిలా నిరాశపరుస్తాడో చూడాలి.
బౌలింగ్ దళం ఏం చేస్తుందో!
టీమిండియా బౌలింగ్ లో బుమ్రా లేకపోవడం పెద్ద లోటనుకుంటే.. ఇప్పుడు గాయంతో మరో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ లు భారత్ ఫాస్ట్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. వీరిలో సిరాజ్ ఒక్కడే మిగిలినవారి కన్నా కొంచెం సీనియర్. మిగతా వారిలో చాహర్, శార్దూల్ కొంచెం పర్లేదు. మిగతా ఇద్దరూ ఇప్పుడిప్పుడే జట్టులోకి వచ్చారు. మరి వీరు ఎలా రాణిస్తారో చూడాలి. ఇక స్పిన్ భారాన్ని అక్షర్, సుందర్, షాబాజ్ అహ్మద్ లు మోయనున్నారు.
పిచ్ పరిస్థితి
ఢాకాలోని షేర్ ఏ బంగ్లా మైదానం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. వర్ష సూచన లేదు.
బంగ్లాదేశ్ తుది జట్టు (అంచనా)
నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్.
భారత్ తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్.
Just 1️⃣ sleep away from the #BANvIND ODI series opener ⏳#TeamIndia pic.twitter.com/HKmyUgtqh1
— BCCI (@BCCI) December 3, 2022
Hanuma Vihari: శెబ్బాష్ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్ చేశాడు!
IND vs AUS Test: కోలుకున్న బుమ్రా- ఆసీస్ తో చివరి 2 టెస్టులకు అందుబాటులోకి పేసు గుర్రం!
IND vs AUS Test: అహ్మదాబాద్ లో భారత్- ఆస్ట్రేలియా ఆఖరి టెస్ట్- వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు!
Women's T20 World Cup 2023 Schedule: ఫిబ్రవరి 10 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్- 12న చిరకాల ప్రత్యర్థితో భారత్ ఢీ
Hardik Pandya: నిర్ణయాలు నావే, ఫలితానికి బాధ్యతా నాదే: హార్దిక్ పాండ్య
కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!
BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?