IND vs AUS, 3rd Test: అద్భుతం జరగలేదు ఆసీస్‌ను ఓడించలేదు - ఇండోర్‌లో టీమ్‌ఇండియాకు పరాభవం!
IND vs AUS, 3rd Test: ఇండోర్ టెస్టులో టీమ్ఇండియా ఓటమి చవిచూసింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించేసింది.
IND vs AUS, 3rd Test:
నెర్రెలు వాసిన పిచ్! బంతిని గింగిరాలు తిప్పించే స్పిన్నర్లు! మైండ్ గేమ్ ఆడితే గెలవచ్చేమో అనే ఆశలు! ఇండోర్ టెస్టు మూడో రోజు ఆట మొదలయ్యేముందు టీమ్‌ఇండియా సిచ్యువేషన్ ఇదీ! కానీ అద్భుతమేమీ జరగలేదు. అసాధ్యం సుసాధ్యం అవ్వలేదు. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించేసింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించేసింది. ఆఖరి టెస్టుకు కొండంత ఆత్మవిశ్వాసం సాధించేసింది. ట్రావిస్ హెడ్ (49; 53 బంతుల్లో 6x4, 1x6), మార్నస్ లబుషేన్ (28; 58 బంతుల్లో 6x4) ఎలాంటి 'కంగారూ' లేకుండా ఆసీస్‌ను గెలిపించేశారు.
వికెట్లు పడలేదు!
మూడో రోజు, శుక్రవారం ఆసీస్ తాజాగా ఛేదనకు దిగింది. పరుగుల ఖాతా తెరవక ముందే ఉస్మాన్ ఖవాజా (0)ను అశ్విన్ ఔట్ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఎడమచేతి వాటం బ్యాటర్లను పదేపదే ఇబ్బంది పెట్టాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ కుదురుగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. టీమ్‌ఇండియా స్పిన్నర్లను ఆచితూచి ఎదుర్కొన్నాడు. పది ఓవర్ల తర్వాత వీరిద్దరూ దూకుడు పెంచారు. దొరికిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించి ఆత్మవిశ్వాసం సాధించారు. ఆపై నిర్భయంగా షాట్లు ఆడేసి 18.5 ఓవర్లకు ఆసీస్‌కు 9 వికెట్ల తేడాతో విజయం అందించారు. మరో 3 వికెట్లు పడుంటే ఆట రసవత్తరంగా ఉండేది.
Australia win the Third Test by 9 wickets. #TeamIndia 🇮🇳 will aim to bounce back in the fourth and final #INDvAUS Test at the Narendra Modi Stadium in Ahmedabad 👍🏻👍🏻
— BCCI (@BCCI) March 3, 2023
Scorecard ▶️ https://t.co/t0IGbs2qyj @mastercardindia pic.twitter.com/M7acVTo7ch
ఇదీ టీమ్‌ఇండియా తీరు!
రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 60.3 ఓవర్లకు 163కు ఆలౌటైన సంగతి తెలిసిందే. నయావాల్ చెతేశ్వర్ పుజారా (59; 142 బంతుల్లో 5x4, 1x6) ఎప్పట్లాగే ఒంటరి పోరాటం చేశాడు. శ్రేయస్ అయ్యర్ (26; 27 బంతుల్లో 3x4, 2x6) కీలక భాగస్వామ్యంలో పాలు పంచుకొన్నాడు. నేథన్ లైయన్ (8/64) రెచ్చిపోయాడు. జట్టు స్కోరు 15 వద్దే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (5; 15 బంతుల్లో) ఔటయ్యాడు. 4.6వ బంతికి నేథన్ లైయన్ అతడిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. సాలిడ్‌గా కనిపించిన రోహిత్ శర్మ (12; 33 బంతుల్లో)నూ అతడే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (13; 26 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. కాగా జట్టు స్కోరు 54 వద్ద కింగ్‌ను కునెమన్ ఎల్బీగా పెవిలియన్ పంపించాడు. చాలాసేపు డిఫెన్స్ ఆడిన రవీంద్ర జడేజా (7; 36 బంతుల్లో)ను లైయన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. 79/4తో భారత్ తేనీటి విరామం తీసుకుంది.
పుజారా ఒక్కడే!
కఠిన పరిస్థితుల్లో శ్రేయస్, పుజారా ఐదో వికెట్‌కు 39 బంతుల్లో 35 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యం అందించారు. స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించారు. పిచ్ నిర్జీవంగా మారుతుండటంతో వేగంగా ఆడారు. జట్టు స్కోరు 113 వద్ద అయ్యర్‌ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. శ్రీకర్ భరత్ (3) కాసేపే ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (16; 28 బంతుల్లో 2x4) అండతో పుజారా హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ క్రమంలో యాష్‌ను లైయన్ ఎల్బీ చేశాడు. 155 వద్ద నయావాల్‌ను లైయన్ ఔట్ చేశాడు. లెగ్‌సైడ్ వెళ్లిన బంతిని స్టీవ్‌స్మిత్ అద్భుతంగా అందుకున్నాడు. ఉమేశ్ (0) భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. అక్షర్ పటేల్ (15 నాటౌట్; 39 బంతుల్లో 1x6) సింగిల్స్ నిరాకరిస్తూ పరుగులు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే లైయన్ వేసిన 60.3వ బంతిని ముందుకొచ్చిన ఆడబోయిన సిరాజ్ (0; 7 బంతుల్లో) క్లీన్‌బౌల్డ్ అవ్వడంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.
ఇన్నింగ్స్ వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ - 109 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ - 197 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ - 163 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ - 78/1తో విజయం