Asia Cup 2025 Ind Vs Oman Result Update: హడలెత్తించిన ఒమన్.. ఆఖర్లో పుంజుకుని, గట్టెక్కిన భారత్.. టోర్నీలో హ్యాట్రిక్ విజయాల నమోదు.. రాణించిన శాంసన్, కలీమ్, మీర్జా
ఇండియా, ఒమన్ పోరు ఉత్కంఠభరితంగా జరిగింది. బ్యాటింగ్ లో అదరగొట్టిన ఒమన్.. భారత్ కు చెమటలు పట్టించింది. అయితే చివర్లో పుంజుకున్న ఇండియా.. విజయాన్ని సొంతం చేసుకుని, హ్యాట్రిక్ కొట్టింది.

Asia Cup 2025 Ind vs Oman Latest News : ఆసియాకప్ 2025లో త్రుటిలో పెను సంచలనం తప్పిపోయింది. రెండు వరుస విజయాలతో జోరు చూపించిన డిఫెండింగ్ చాంపియన్ భారత్ కు పసికూన ఒమన్ చుక్కలు చూపించింది. ఆఖర్లో నిలబడిన భారత్.. ఫైట్ చేసి, 21 పరుగులతో గెలుపొంది, టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అంతకుముందు అబుధాబి వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ స్టన్నింగ్ ఫిఫ్టీ (45 బంతుల్లో 56, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో షా ఫైజల్, జితెన్ రామనంది, ఆమీర్ కలీమ్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన ఒమన్.. ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసి, కొద్దిలో విజయాన్ని మిస్ చేసుకుంది. ఓపెనర్ ఆమిర్ కలీమ్ అద్భుతమైన అర్ద సెంచరీ (46 బంతుల్లో64, 7 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో ఒక వికెట్ తో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు. అలాగే అర్షదీప్ సింగ్ .. ఈ ఫార్మాట్లో వంద వికెట్ల మైలురాయిని చేరుకుని ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. ఈ విజయంతో గ్రూప్-ఏలో మూడు విజయాలు సాధించి, అగ్రస్తానంతో సూపర్-4కు భారత్ ప్రవేశించింది.
Innings Break!
— BCCI (@BCCI) September 19, 2025
Sanju Samson's 56(45) powers #TeamIndia to 188/8 💥
Over to our bowlers 🎯
Updates ▶️ https://t.co/XAsd5MHdx4#INDvOMA | #AsiaCup2025 pic.twitter.com/D8G5pI0Z6M
శాంసన్ వీరంగం..
తుదిజట్టులో ఉన్నప్పటికీ తొలి రెండు మ్యాచ్ ల్లో బ్యాటింగ్ అవకాశం రాని సంజూ ఈసారి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అంతకుముందు ఓపెనర్లలో శుభమాన్ గిల్ (5) మరోసారి విఫలమవగా, అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి ధనాధన్ కామియో ఆడాడు. వీరిద్దరూ వెనుదిరిగిన తర్వాత శాంసన్ జోరు చూపించాడు. అయితే మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమైనా, అక్షర్ పటేల్ (26), తిలక్ వర్మ (29) సాయంతో జట్టుకు భారీ స్కోరును అందించాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. మిగతావాళ్లకు బ్యాటింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ కు రాలేదు.
సూపర్ భాగస్వామ్యం..
భారీ టార్గెట్ ఛేదనతో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఒమన్ కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు జతీందర్ సింగ్ (32), కలీమ్ తొలి వికెట్ కు 56 పరుగులు జోడించి చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. జతీందర్ ఔటైనా తర్వాత ఇన్నింగ్స్ లో ఒక్కసారి ఊపు వచ్చింది. హమ్మద్ మీర్జా సూపర్బ్ ఫిఫ్టీ (33 బంతుల్లో 51, 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు కలీమ్ కూడా రెచ్చిపోయి, విధ్వంసం సృష్టించారు. ఈ మధ్యలో పార్ట్ టైం బౌలర్లు కూడా బౌలింగ్ వేయడం ఒమన్ కు కలిసొచ్చింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన వీరిద్దరూ 55 బంతుల్లోనే 95 పరుగులు జోడించి, భారత అభిమానులను కలవరపెట్టారు. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరూ ఔట్ కావడం, కొండంతగా రన్ రేట్ పెరిగి పోవడంతో ఆఖరికి ఒమన్ తలవంచక తప్పలేదు. పాండ్యాతోపాటు అర్షదీప్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. శనివారం నుంచి సూపర్-4మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో శ్రీలంక తలపడనుంది. ఆదివారం పాకిస్థాన్ తో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.




















