టీమ్ జెర్సీలోనూ పీసీబీ కక్కుర్తి.. అవినీతి బయటపెట్టిన పాక్ మాజీ
టీమిండియా ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయారంటూ రచ్చ చేస్తున్న పీసీబీకి.. ఆ జట్టు మాజీ క్రికెటర్ అతీక్-ఉజ్-జమాన్ ఊహించని షాకిచ్చాడు. పాక్ ఆటగాళ్ల జెర్సీ విషయంలో పీసీబీ భారీ అవినీతి చేసిదంటూ కొత్త వివాదానికి తెరలేపాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు ధరిస్తున్న జెర్సీ క్వాలిటీ చాలా తక్కువగా ఉందని, పీసీబీ చేసిన అవినీతి వల్లే ఆటగాళ్లు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. ‘ఆసియా కప్‌లో మిగిలిన జట్ల ఆటగాళ్లు మంచి డ్రై-ఫిట్ జెర్సీలు ధరిస్తుంటే.. పాకిస్తాన్ ఆటగాళ్లు మత్రం చెమటను ఏ మాత్రం పీల్చుకోలేని తక్కువ క్వాలిటీ గల జెర్సీలు ధరిస్తున్నారు.టెండర్లు ఎక్స్‌పర్ట్స్‌కి కాకుండా.. స్నేహితులకు ఇస్తే ఇలాగే జరుగుతుంది. చెమట కంటే అవినీతి ఎక్కువగా పడుతుంది. ప్లేయర్లు క్వాలిటీ లేని జెర్సీలు ధరించడం వల్ల అధికంగా చెమట పట్టడమే కాకుండా.. అది వాళ్ల పెర్ఫార్మెన్స్‌పై కూడా దెబ్బతీస్తోంది’ అంటూ అతీక్ చేసిన పోస్ట్ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్లో పెద్ద సంచలనంగా మారింది. అతీక్ పాక్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 69 మ్యాచ్‌లు ఆడి మూడు సెంచరీలతో 2521 పరుగులు సాధించాడు. 2023 నుంచి జర్మనీ క్రికెట్ టీమ్‌కి కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకవేళ ఈ మాట ఎవరైనా సాధారణ వ్యక్తి అని ఉంటే పెద్దగా రచ్చ జరిగేది కాదేమో.. కానీ పాకిస్తాన్ తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అతీక్.. తన సొంత దేశపు క్రికెట్ బోర్డ్‌పైనే ఈ అవినీతి ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనికి పీసీబీ ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి.





















