IND vs WI T20: హార్దిక్ ఏంటీ నిర్ణయాలు! ఫేవరెట్ ఆటగాళ్ల వెంట పరుగెత్తితే ఫలితాలు రావు!
IND vs WI T20: వెస్టిండీస్ చేతిలో ఓడిపోవడం బాధాకరమని టీమ్‌ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అంటున్నాడు. హార్దిక్ పాండ్య నిర్ణయాలు అస్సలు బాగాలేవన్నాడు.
IND vs WI T20:
వెస్టిండీస్ చేతిలో ఓడిపోవడం బాధాకరమని టీమ్‌ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) అంటున్నాడు. హార్దిక్ పాండ్య (Hardik Pandya) నిర్ణయాలు అస్సలు బాగాలేవన్నాడు. బ్యాటింగ్ చేసేవాళ్లతో బౌలింగ్.. బౌలింగ్ చేసే వాళ్లతో బ్యాటింగ్ చేయించడం వల్ల ఫలితం ఉండదన్నాడు. అస్సలు ఆలోచించకుండా ఫేవరెట్ ఆటగాళ్ల వెంట పడుతున్నాడని విమర్శించాడు. వెస్టిండీస్‌తో ఐదో టీ20లో ఓటమి తర్వాత వెంకీ ఎక్స్ ఫ్లాట్‌ఫామ్‌లో స్పందించాడు.
వెస్టిండీస్‌తో (IND vs WI) జరిగిన ఐదో టీ20లో టీమ్‌ఇండియా పరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. ఆ తర్వాత వెస్టిండీస్ 18 ఓవర్లలోనే రెండు వికెట్లు చేజార్చుకొని టార్గెట్ ఛేజ్ చేసింది. 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది. కరీబియన్లలో బ్రాండన్ కింగ్ (85: 55 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు), నికోలస్ పూరన్ (47: 35 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) రాణించారు. భారత్‌లో సూర్యకుమార్ యాదవ్ (61: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్. తిలక్ వర్మ (27: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అతడికి సహకారం అందించాడు.
'టీమ్‌ఇండియా తమ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవాలి. ఆటగాళ్లలో పట్టుదల, తీవ్రత లోపం కనిపిస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యకు కొన్నిసార్లు ఏం చేయాలో అర్థమవ్వడమే లేదు. బౌలర్లు బ్యాటింగ్.. బ్యాటర్లను బౌలింగ్ చేయలేరు కదా. నీకు ఇష్టమైన ఆటగాళ్లు కాబట్టి గుడ్డిగా ఓకే చెప్పేవాళ్ల వెంట పరుగెత్తకూడదు. ఎక్కువ మంచి కోసం ఆలోచించాలి' అని వెంకీ ప్రసాద్ అన్నాడు.
'కొన్నాళ్లుగా టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో సాధారణ జట్టుగా మారిపోయింది. కొన్ని నెలల క్రితం టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించని విండీస్ చేతిలో ఓడిపోయింది. మనం బంగ్లాదేశ్ సిరీసులోనూ ఓటమి పాలయ్యాం. ఇలాంటి సిల్లీ ప్రకటనలు చేయడానికి బదులు అంతర్మథనం చేసుకుంటారని ఆశిస్తున్నా' అని వెంకటేశ్ ప్రసాద్ పేర్కొన్నాడు.
'కేవలం 50 ఓవర్ల ప్రపంచకప్పే కాదు కొన్నాళ్ల క్రితం టీ20 ప్రపంచకప్‌కూ విండీస్ ఎంపికవ్వలేదు. టీమ్‌ఇండియా ఘోరంగా ఆడటం చూస్తుంటే బాధేస్తోంది. ప్రాసెస్‌లో భాగంగా ఇలాంటి ఓటముల చూస్తుండటం కష్టంగా ఉంది. ఆటగాళ్లలో కసి, పట్టుదల, ఫైర్ కనిపించడం లేదు. వాళ్లు భ్రాంతిలో బతుకుతున్నారు' అని వెంకీ ట్వీట్ చేశాడు.
Also Read: నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడే ఓడిపోయాం: హార్దిక్ పాండ్య
Also Read: సిరీస్ వెస్టిండీస్‌దే - చివరి టీ20లో టీమిండియా ఘోర పరాజయం!