IND vs WI: గెలిపించినా.. బ్యాటర్లకు కఠిన సందేశం పంపిన హార్దిక్ పాండ్య
IND vs WI: టీమ్‌ఇండియా బ్యాటర్లు కఠిన పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కెప్టెన్ హార్దిక్ పాండ్య అంటున్నాడు. ఒత్తిడి ఉన్నప్పుడే అసలైన సామర్థ్యం బయటపడుతుందని పేర్కొన్నాడు.
![IND vs WI: గెలిపించినా.. బ్యాటర్లకు కఠిన సందేశం పంపిన హార్దిక్ పాండ్య ind vs wi t20 series hardik pandya sent stern message to team india batters IND vs WI: గెలిపించినా.. బ్యాటర్లకు కఠిన సందేశం పంపిన హార్దిక్ పాండ్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/13/61d3b3f2369c2e9fcd7c9058978aafcc1691905811928251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs WI:
టీమ్‌ఇండియా బ్యాటర్లు కఠిన పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అంటున్నాడు. ఒత్తిడి ఉన్నప్పుడే అసలైన సామర్థ్యం బయటపడుతుందని పేర్కొన్నాడు. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (Yashasvi Jaiswal), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) బ్యాటింగ్ అదిరిపోయిందని వెల్లడించాడు. మొదటి టీ20లో ఆఖర్లో తాము పట్టు తప్పామని వివరించాడు. వెస్టిండీస్‌తో నాలుగో టీ20 తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
వెస్టిండీస్‌తో ఐదు టీ2౦ల సిరీసును భారత్ (IND vs WI) సమం చేసింది. నాలుగో మ్యాచులో తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమ్‌ఇండియా 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 179 పరుగులతో విజయ దుందుభి మోగించింది. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (84 నాటౌట్: 51 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (77: 47 బంతుల్లో, మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) అదరగొట్టాడు.
'అద్భుతం. యశస్వీ జైశ్వాల్, శుభ్‌మన్ గిల్ నైపుణ్యాలపై ఎవరికీ సందేహాల్లేవు. కాకపోతే వారు క్రీజులో కాసేపు గడపాలి. మున్ముందు మా బ్యాటర్లు మరింత బాధ్యత వహించాలి. బౌలింగ్ యూనిట్‌కు అండగా నిలవాలి. మ్యాచులను గెలిపించేది బౌలర్లే అని నేనెప్పుడూ నమ్మతాను. ఓపెనర్లు దూకుడుగా ఆడటం ఆనందంగా ఉంది. నేను మ్యాచును చూసే తీరును బట్టి నా కెప్టెన్సీ ఉంటుంది. పరిస్థితులను బట్టి నా చర్యలు ఉంటాయి' అని హార్దిక్ పాండ్య అన్నాడు.
'అవును, మేం మొదటి రెండు మ్యాచులు ఓడిపోయాం. మా తప్పిదాల వల్లే తొలి మ్యాచును చేజార్చుకున్నాం. గెలుపు వైపు పయనిస్తున్న మేము ఆఖరి నాలుగు ఓవర్లలో గతి తప్పాం. ఇలాంటి మ్యాచులు మన మూర్తిమత్వాన్ని పరీక్షిస్తాయని మేమంతా మాట్లాడుకున్నాం. మేం మారాల్సిన అవసరం ఉందని ఆ రెండు మ్యాచులు సంకేతాలు పంపించాయి. టీ20 క్రికెట్లో ఎవరూ ఫేవరెట్ కాదు. బాగా ఆడితేనే గెలుస్తారు. ప్రత్యర్థిని గౌరవించాలి. మా కన్నా మెరుగైన క్రికెట్ ఆడారు కాబట్టి 2-0తో ఆధిక్యం సాధించారు. సిరీస్‌ను దక్కించుకోవాలంటే నేడు చేసిందే ఆదివారమూ చేయాలి' అని హార్దిక్ పాండ్య వెల్లడించాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)