IND vs WI 3rd ODI: మళ్లీ అడ్డుపడ్డ వరుణుడు - భారత్ ఇన్నింగ్స్ దాదాపు ముగిసినట్లే - గిల్ ఆశలపై నీళ్లు!
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకు వర్షం రెండోసారి ఆటంకం కలిగించింది. అయితే ఈసారి భారత్ ఇన్నింగ్స్ దాదాపు పూర్తయినట్లే అనుకోవచ్చు.
టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో వన్డేను వర్షం మళ్లీ అడ్డుకుంది. టీమిండియా ఇన్నింగ్స్‌లో 24 ఓవర్ల తర్వాత మొదటిసారి వర్షం పడటంతో ఆట వాయిదా పడింది. అప్పుడు దాదాపు రెండు గంటల సమయాన్ని వర్షం తినేసింది. దీంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ఇప్పుడు ఒకవేళ వర్షం తగ్గకపోతే మ్యాచ్ పూర్తిగా రద్దు కానుంది. అయితే భారత్ ఈ సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకుంది.
వర్షం కారణంగా ఆట ఆగే సమయానికి టీమిండియా 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. మొదట ఆట ఆగినప్పుడు భారత్ 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. అంటే ఓవర్లు కుదించాక ఆటలో వేగాన్ని పెంచి తర్వాత కేవలం 12 ఓవర్లలోనే 110 పరుగులను సాధించారన్న మాట. ఒకవేళ వర్షం ఆగిన వెంటనే వెస్టిండీస్ ఇన్నింగ్స్ ప్రారంభం అయితే వారు 36 ఓవర్లలో 263 పరుగులను ఛేదించాల్సి ఉంటుంది.
ఓపెనర్ శిఖర్ ధావన్ (58: 74 బంతుల్లో, ఏడు ఫోర్లు) అర్థ సెంచరీ పూర్తి చేసుకోగా... శుభ్‌మన్ గిల్ (98 నాటౌట్: 98 బంతుల్లో బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) శతకానికి రెండు పరుగులు ఉందనగా వర్షం పడటంతో నిరాశ చెందాడు. గ్రౌండ్ నుంచి చిట్టచివరిగా బయటకు వెళ్లింది శుభ్‌మన్ గిలే కావడం తను ఎంత నిరాశ చెందాడో చెబుతుంది.
మిగిలిన బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ విఫలం అయ్యాడు. సంజు శామ్సన్ గిల్‌కు తోడుగా క్రీజులో నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో హేడెన్ వాల్ష్ రెండు వికెట్లు, అకియల్ హొస్సేన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
View this post on Instagram