IND vs SL ODI Series: కోహ్లీ, బుమ్రా, రోహిత్ - 35 నెలల్లో కలిసి ఆడింది ఒకే వన్డే!
IND vs SL ODI Series: టీమ్‌ఇండియా మ్యాచ్ విన్నర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ విషయంలోనూ ఓ వింత జరిగింది. 35 నెలల్లో ఈ ముగ్గురూ కలిసి ఆడింది ఒకే ఒక్క వన్డే అంటే నమ్మగలరా!
IND vs SL ODI Series:
క్రికెట్ ఓ విచిత్రమైన ఆట! ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎవరు గాయాల పాలవుతారో అంచనా వేయలేరు! కొందరు ఆటగాళ్లు కలిసి ఆడటం చాలా అరుదుగా చూస్తుంటాం. టీమ్‌ఇండియా మ్యాచ్ విన్నర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ విషయంలోనూ ఇలాగే జరిగింది. 35 నెలల్లో ఈ ముగ్గురూ కలిసి ఆడింది ఒకే ఒక్క వన్డే అంటే నమ్మగలరా!
అవును.. మీరు చదివింది నిజమే! బుమ్రా, రోహిత్, కోహ్లీ 35 నెలల్లో కలిసి ఆడింది కేవలం ఒకే ఒక్క వన్డే. గతేడాది ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో ఈ త్రయం కలిసి ఆడింది. అంతకు ముందు, ఆ తర్వాత కలిసి ఆడటం గగనమే అయింది. ఇందుకు కొన్ని కారణాలు లేకపోలేదు.
టీమ్‌ఇండియా చివరి మూడేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు ఆడింది. పొట్టి కప్పుల వల్ల వన్డేలపై బీసీసీఐ ఎక్కువగా దృష్టి పెట్టలేదు. టీ20 ఫార్మాట్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా సీనియర్ క్రికెటర్లకు సమయానికి తగినట్టు విశ్రాంతి కల్పించింది. ఫామ్ కోల్పోయిన కింగ్ కోహ్లీ సహజంగానే 50 ఓవర్ల ఫార్మాటుకు కొన్నిసార్లు దూరమయ్యాడు. ఇక గాయాలు, ఫిట్‌నెస్ ఇబ్బందులతో రోహిత్ ఆ ఫార్మాట్‌ను పట్టించుకోలేదు. జస్ప్రీత్ బుమ్రాపై పని భారం పెరిగింది. గాయాల వల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు చాన్నాళ్లు అందుబాటులో లేడు.
భారత క్రికెట్లో అత్యంత వేగంగా ఎదిగిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా. 2022, జులై 14న లార్డ్స్ వేదికగా చివరి వన్డే ఆడాడు. ఆ మ్యాచులో 2 వికెట్లు పడగొట్టాడు. అయితే గతేడాది మొత్తంగా అతనాడింది కేవలం 5 వన్డేలు, 5 టీ20లు. ఆ తర్వాత వెన్నెముక గాయంతో టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడలేదు. ఆలస్యంగా కోలుకోవడంతో శ్రీలంకతో టీ20లకు ఎంపిక చేయలేదు.
పదేపదే గాయాల పాలవుతుండటంతో జస్ప్రీత్ బుమ్రా పొట్టి ఫార్మాట్‌కు ఎంపికవ్వడం ఇకపై కష్టమే. ఈ ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌లో అతడే ప్రధాన ఆయుధం. అందుకే బీసీసీఐ ముందు జాగ్రత్త పడుతోంది. లంకతో వన్డే సిరీసుకు మాత్రమే ఎంపిక చేసింది. తిరిగి విరాట్ కోహ్లీ, రోహిత్ సైతం జట్టులోకి వచ్చారు. చాన్నాళ్ల తర్వాత ఈ ముగ్గురూ వన్డేల్లోకి రావడం విశేషం.
View this post on Instagram