(Source: ECI/ABP News/ABP Majha)
IND Vs SL: థ్రిల్లర్ మ్యాచ్‌లో లంక విక్టరీ - పోరాడి ఓడిన టీమిండియా!
శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
భారత్‌తో జరిగిన రెండో టీ20లో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 190 పరుగులకు పరిమితం అయింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేశారు.
207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (2: 5 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (5: 3 బంతుల్లో, ఒక ఫోర్), వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (5: 5 బంతుల్లో, ఒక ఫోర్)ఘోరంగా విఫలం అయ్యారు. వీరు ముగ్గురూ రెండంకెల స్కోరు చేయడంతో విఫలం అయ్యారు. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా (12: 12 బంతుల్లో, ఒక ఫోర్), దీపక్ హుడా (9: 12 బంతుల్లో) కూడా విఫలం కావడంతో భారత్ 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో శ్రీలంకకు విజయం నల్లేరు మీద నడకలా అనిపించింది.
కానీ అక్కడ సూర్యకుమార్ యాదవ్(51: 36 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), అక్షర్ పటేల్(65: 31 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 42 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు. అయితే కీలకమైన సమయంలో సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో అక్షర్ పటేల్‌పై ఒత్తిడి పెరిగింది. అక్షర్, శివం మావి (26: 15 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) జోడి వేగంగా ఆడినప్పటికీ అది విజయానికి సరిపోలేదు. దీంతో భారత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 190 పరుగులకు పరిమితం అయింది.
బాదేసిన శ్రీలంక
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. కానీ శ్రీలంకకు ఓపెనర్లు పతుం నిశ్శంక (33: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కుశాల్ మెండిస్ (52: 31 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) శుభారంభం అందించారు. నిశ్శంక నిదానంగా ఆడినా, కుశాల్ మెండిస్ మాత్రం చెలరేగిపోయాడు. పిచ్ మొదట్లో పేసర్లకు కూడా అనుకూలించలేదు. దీంతో శ్రీలంక మొదటి ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు సాధించింది. ఈ దశలో శ్రీలంక 200 పరుగులు చేస్తుందనిపించింది.
కానీ స్పిన్నర్ల ఎంట్రీతో శ్రీలంక స్కోరు బోర్డు మారిపోయింది. కుశాల్ మెండిస్‌ను అవుట్ చేసి యుజ్వేంద్ర చాహల్ భారత్‌కు మొదటి వికెట్ అందించారు. ఆ తర్వాత భానుక రాజపక్సను (2: 3 బంతుల్లో) ఉమ్రాన్ మాలిక్, మరో ఓపెనర్ పతుం నిశ్శంకను అక్షర్ పటేల్ అవుట్ చేశారు. దీంతో శ్రీలంక 16 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. స్కోరు మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులకు చేరుకుంది.
ఆ తర్వాత చరిత్ అసలంక (37: 19 బంతుల్లో, నాలుగు సిక్సర్లు), కెప్టెన్ దసున్ షనక (56 నాటౌట్: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు) రాణించారు. మధ్య ఓవర్లలో అసలంక, చివరి ఓవర్లలో షనక సిక్సర్లతో చెలరేగి ఆడారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ రెండు, యుజ్వేంద్ర చాహల్ ఒక వికెట్ తీశారు. శ్రీలంక చివరి ఐదు ఓవర్లలో 77 పరుగులు సాధించడం విశేషం.