IND VS SA Highlights: క్లాసెన్ మాస్టర్ క్లాస్ - రెండో టీ20లోనూ టీమిండియా ఓటమి!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్లతో ఓటమి పాలైంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-0 ఆధిక్యం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రొటీస్ బ్యాట్స్‌మన్ క్లాసెన్ (81: 46 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడాడు.
తడబడ్డ టీమిండియా
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మొదటి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మొదటి ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత ఇషాన్ కిషన్ (34: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్‌లపై (40: 35 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) పడింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించారు.
అయితే ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (5: 7 బంతుల్లో), హార్దిక్ పాండ్యా (9: 12 బంతుల్లో, ఒక ఫోర్), అక్షర్ పటేల్ (10: 11 బంతుల్లో) విఫలం అయ్యారు. దీంతో స్కోరు కూడా మందగించింది. చివర్లో దినేష్ కార్తీక్ (30: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) కొంచెం వేగంగా ఆడటంతో భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగలిగింది.
క్లాసెన్ వన్‌మ్యాన్ షో
149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (4: 3 బంతుల్లో, ఒక ఫోర్), డ్వేన్ ప్రిటోరియస్ (4: 5 బంతుల్లో, ఒక ఫోర్), రాసీ వాన్ డర్ డుసెన్ (1: 7 బంతుల్లో) ఆరు ఓవర్లలోపే పెవిలియన్ బాట పట్టారు. దీంతో దక్షిణాఫ్రికా 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
అయితే కెప్టెన్, ఓపెనర్ తెంబా బవుమా (35: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), క్లాసెన్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఒక ఎండ్‌లో బవుమా వికెట్లు పడకుండా కాపాడగా... మరోవైపు క్లాసెన్ చెలరేగి ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 41 బంతుల్లోనే 64 పరుగులు జోడించారు. ఆ తర్వాత బవుమా అవుటైనా... మిల్లర్‌తో కలిసి ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించి క్లాసెన్ విక్టరీని కన్‌ఫర్మ్ చేశాడు. చివర్లో క్లాసెన్, వేన్ పార్నెల్ అవుటైనా మిల్లర్ మ్యాచ్‌ను ముగించాడు. భారత బౌలర్లలో భువీ నాలుగు వికెట్లు తీయగా... హర్షల్ పటేల్, చాహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.