IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!
IND vs SA, 1st ODI, Ekana Sports City: భారత్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 పరుగులతో విజయం సాధించింది.
![IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు! IND vs SA 1st ODI South Africa won the match by 9 runs against India at Ekana Sports City Stadium IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/20630713bc0993eef28fdf79f370c6f21665077514079252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్‌తో జరిగిన మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా తొమ్మిది పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అనంతరం భారత్ 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 240 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తొమ్మిది పరుగులతో ఓటమి పాలైంది. సంజు శామ్సన్ (86 నాటౌట్: 63 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు) ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే ఆదివారం రాంచీలో జరగనుంది.
అదరగొట్టిన మిల్లర్, క్లాసీన్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు జానేమన్ మలన్ (22: 42 బంతుల్లో, మూడు ఫోర్లు), క్వింటన్ డికాక్ (48: 54 బంతుల్లో, ఐదు ఫోర్లు) మొదటి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అనంతరం జానేమన్ మలన్‌ను అవుట్ చేసి ఠాకూర్ ఇండియాకు మొదటి వికెట్ అందించారు. అయితే ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ టెంబా బవుమా (8: 12 బంతుల్లో, రెండు ఫోర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (0: 5 బంతుల్లో) విఫలం అయ్యారు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా అర్థ సెంచరీ ముంగిట అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 110 పరుగులుకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్: 63 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు), హెన్రిచ్ క్లాసీన్ (74 నాటౌట్: 65 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)జ దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడిని విడదీయడం సాధ్యం కాలేదు. అభేద్యమైన ఐదో వికెట్‌కు వీరు 106 బంతుల్లోనే 139 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలో వీరు 55 పరుగులు చేశారు. దీంతో దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
సంజు షో సరిపోలేదు
250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఎనిమిది పరుగులకే ఓపెనర్లు శిఖర్ ధావన్ (4: 16 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (3: 7 బంతుల్లో) అవుటయ్యారు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ (19: 42 బంతుల్లో, ఒక ఫోర్), ఇషాన్ కిషన్ (20: 37 బంతుల్లో, మూడు ఫోర్లు) పరిస్థితిని కుదుట పరిచే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నంలో వీరు మరీ నెమ్మదిగా ఆడటంతో కావాల్సిన రన్‌రేట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు వీరిద్దరూ వెంట వెంటనే అవుటవ్వడంతో కష్టాలు మరింత పెరిగాయి.
ఆ తర్వాత సంజు శామ్సన్ (86 నాటౌట్: 63 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (50: 37 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) వేగంగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. ఆ తర్వాత అయ్యర్ అవుట్ కావడంతో శార్దూల్ ఠాకూర్ (33: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు) క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలో 73 పరుగులు చేయాల్సిన దశలో సంజు శామ్సన్ చెలరేగాడు. మొదటి రెండు ఓవర్లలో 28 పరుగులు రావడంతో విజయంపై ఆశలు పెరిగాయి. తర్వాతి రెండు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే రావడంతో పాటు మూడు వికెట్లను కూడా భారత్ కోల్పోయింది. చివరి ఓవర్లో 30 పరుగులు కావాల్సిన దశలో సంజు శామ్సన్ 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో భారత్ 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)