హై ఆల్టిట్యూడ్ మాస్క్‌తో కోహ్లీ ప్రాక్టీసు- ఇంతకీ ఏమైనట్టు?
Asia Cup 2022: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... పాక్ తో సూపర్- 4 మ్యాచుకు ముందు హై ఆల్టిట్యూడ్ మాస్క్ ధరించి ప్రాక్టీసులో పాల్గొన్నాడు.
సూపర్- 4 మ్యాచ్ లో భాగంగా ఆదివారం టీమిండియా పాకిస్థాన్ ను ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచుకు ముందు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ హై ఆల్టిట్యూట్ మాస్క్ తో ప్రాక్టీసులో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మాస్క్ ఆటగాళ్ల శ్వాస కండరాలను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా ఊపరితిత్తుల పని సామర్థ్యాన్ని పెంచుతుంది.
యూఏఈ వాతావరణంలో చాలామంది ఆటగాళ్లు ఇబ్బందిపడుతున్నారు. వేడి, తేమ పరిస్థితుల్లో ఆటగాళ్లు గాయపడుతున్నారు. పాకిస్థాన్ ఆటగాడు నసీం షా భారత్ తో మ్యాచ్ లో కండరాలు పట్టేసి ఇబ్బందిపడ్డాడు. అందుకే ముందు జాగ్రత్తగా కోహ్లీ హై ఆల్టిట్యూడ్ మాస్కుతో ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ తో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ లీగ్ దశ రెండు మ్యాచుల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు. పాకిస్థాన్ పై 35, హాంకాంగ్ పై అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్‌తో కలిసి 98పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో.. ఆదివారం పాక్ తో మ్యాచ్ లో విరాట్ కీలకం కానున్నాడు.
ప్రదర్శన అంతంతమాత్రమే
ఆసియా కప్ లో భారత్ ప్రదర్శన ఆశించిన విధంగా లేదు. బ్యాటింగ్ విభాగం అనుకున్నంతగా రాణించట్లేదు. గాయం నుంచి కోలుకుని తిరిగివచ్చిన రాహుల్ ఇంకా ఫాంలోకి రాలేదు. పాక్ పై డకౌట్ అయిన అతను.. హాంకాంగ్ తో మ్యాచ్లో 36 పరుగులు చేయడానికి 39 బంతులు తీసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ తన స్టైల్ బ్యాటింగ్ తో ఆకట్టుకోవడంలేదు. పాక్ పై ఎక్కువ బంతులు ఆడకుండానే పెవిలియన్ చేరిన రోహిత్.. పసికూనతో మ్యాచ్ లో 21 పరుగులు చేసినప్పటికీ అది తన స్థాయికి తగిన ప్రదర్శన కాదు. ఇక కోహ్లీ రెండు మ్యాచుల్లోనూ రాణించినప్పటికీ.. మునుపటిలా ఆడట్లేదన్నది అంగీకరించవలసిన విషయం. ఇక సూర్యకుమార్, పాండ్య సూపర్ ఫాంలో ఉన్నారు. అయితే ఆల్ రౌండర్ జడేజా గాయంతో ఈ టోర్నీ మొత్తానికి దూరం కావడం భారత్ కు పెద్ద దెబ్బే. దినేశ్ కార్తీక్, పంత్ కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. వారు ఎలా ఆడతారో చూడాల్సి ఉంది. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒక్కడే బాగా బౌలింగ్ చేస్తున్నాడు.
బలంగా పాక్
మరోవైపు ప్రత్యర్థి పాకిస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ లలో భీకరంగా కనిపిస్తోంది. భారత్ తో మ్యాచ్ లో గెలుపు అంచుల వరకు వెళ్లిన దాయాది.. పసికూన హాంకాంగ్ ను చిత్తుచేసింది. బ్యాటింగ్ లో మెరుపులతో 193 పరుగులు చేసింది. బౌలింగ్ తో హాంకాంగ్ ను 38 పరుగులకే పడగొట్టి.. 155 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇది కచ్చితంగా వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేదే. బ్యాటింగ్ లో కెప్టెన్ బాబర్ విఫలమవుతున్నప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్ షాదాబ్ ఖాన్, ఖుష్ దిల్ షా వంటివారు రాణిస్తున్నారు. బౌలింగ్ లో మొదటి నుంచి పాక్ దుర్భేద్యమే. నసీం షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, దహానీ వంటి వారితో పటిష్ఠంగా ఉంది.
Getting into the #AsiaCup2022 Super Four groove 👌 👌#TeamIndia pic.twitter.com/VMcyG9ywQ5
— BCCI (@BCCI) September 2, 2022