IND vs NZ 3rd T20I: రేపు భారత్- కివీస్ మూడో టీ20- నేపియర్ వెరీ వెరీ స్పెషల్ అంటున్న లక్ష్మణ్
IND vs NZ 3rd T20I: న్యూజిలాండ్ తో రేపు మూడో టీ20లో టీమిండియా తలపడనుంది. నేపియర్ లోని మెక్లీన్ పార్క్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ గ్రౌండ్ తనకు ప్రత్యేకమంటున్నాడు కోచ్ లక్ష్మణ్. ఎందుకో చూద్దామా..
IND vs NZ 3rd T20I: న్యూజిలాండ్ తో రేపు ఆఖరిదైన మూడో టీ20లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమైనది. ఇప్పటికే రెండో టీ20 గెలిచిన భారత్ ఇందులోనూ విజయం సాధించి సిరీస్ నెగ్గాలని చూస్తోంది. ఇక దీనిలో అయినా గెలిచి సిరీస్ ను సమం చేయాలని కివీస్ అనుకుంటోంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయింది. కాబట్టి ఇది నిర్ణయాత్మక మ్యాచ్. నేపియర్ లోని మెక్లీన్ పార్క్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే నేపియర్ మ్యాచ్ టీమిండియా స్టాండ్ ఇన్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కు ప్రత్యేకమైనది. ఎందుకంటారా.
లక్ష్మణ్‌కి ఇది ఎందుకు ప్రత్యేకం
రేపు మ్యాచ్ జరగనుండగా లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతాలో నేపియర్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఒక ఫోటోను షేర్ చేశాడు. 'నేపియర్ గ్రౌండ్, డ్రెస్సింగ్ రూమ్ నాకు 2009 టెస్ట్ మ్యాచ్ నాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది.' అంటూ క్యాప్షన్ రాసి గౌతమ్ గంభీర్ ను ట్యాగ్ చేశాడు.
ఇంతకీ 2009 టెస్ట్ మ్యాచులో ఏం జరిగింది?
2009లో భారత్ - న్యూజిలాండ్ మధ్య మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి. నేపియర్ లో ఆడిన మ్యాచులో గెలిచి భారత్ సిరీస్ ను సొంతం చేసుకుంది. ఈ మైదానంలో జరిగిన రెండో మ్యాచుకు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. లక్ష్మణ్ తొలి ఇన్నింగ్స్ లో 76 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 124 పరుగులు చేశాడు. అలాగే గౌతం గంభీర్ రెండో ఇన్నింగ్స్ లో 137 పరుగులతో రాణించాడు. అలా నేపియర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
రెండో టీ20లో భారత్ విజయం
మూడు మ్యాచుల సిరీస్ లో మొదటిది వర్షం వల్ల రద్దు కాగా.. రెండో దానిలో టీమిండియా విజయం సాధించింది. కుర్రాళ్లతో నిండిన యువ జట్టు సమష్టిగా రాణించి 65 పరుగుల తేడాతో కివీస్ ను ఓడించింది. బ్యాటింగ్ లో సూర్యకుమార్ సెంచరీతో సత్తా చాటగా.. బౌలింగ్ లో దీపక్ హుడా 4 వికెట్లతో చెలరేగాడు. అయితే సూర్య, ఇషాన్ కిషన్ తప్ప బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. బౌలింగ్ లోనూ ప్రధాన పేసర్ అర్షదీప్ ధారాళంగా పరుగులిచ్చాడు. ఆఖరిదైన మూడో టీ20లో ఈ బలహీనతల్ని కూడా అధిగమించి మ్యాచ్ తో పాటు సిరీస్ ను గెలుచుకోవాలని టీమిండియా భావిస్తోంది.
టీ20 సిరీస్ అనంతరం న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో టీమిండియా తలపడనుంది. దీనికి శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
Fond memories of Napier and this Napier dressing room and ground reminiscing the 2009 test match , @GautamGambhir 🙌 pic.twitter.com/r2i1cTDy54
— VVS Laxman (@VVSLaxman281) November 21, 2022