Rinku Singh: కలగా అనిపిస్తోంది! ముగ్గురం కలిసి ఏడ్చేస్తున్నాం - రింకూసింగ్!
Rinku Singh: ఐదు సిక్సర్ల కుర్రాడు రింకూ సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు. టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడం తనకు కలగా అనిపిస్తోందన్నాడు.
Rinku Singh:
ఐదు సిక్సర్ల కుర్రాడు రింకూ సింగ్ (Rinku Singh) భావోద్వేగానికి గురయ్యాడు. టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడం తనకు కలగా అనిపిస్తోందన్నాడు. ఈ క్షణం కోసమే కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. తన ఎదుగుదలకు కోల్‌కతా నైట్‌రైడర్స్ మేనేజ్‌మెంట్ ఎంతగానో కృషి చేసిందన్నాడు. ఐర్లాండ్‌కు (IND vs IER) ఎంపికవ్వడంతో తన తల్లిదండ్రులు ఆనందబాష్ఫాలు కార్చారని వెల్లడించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో రింకూ సింగ్ సంచలనాలు సృష్టించాడు. అరివీర భయంకరంగా ఆడాడు. డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చి ధనాధన్ సిక్సర్లు బాదేశాడు. ఒక మ్యాచులో అయితే ఆరు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదేసి సెన్సెషన్‌గా మారాడు. ఈ సీజన్లో ఆడిన అన్నింట్లోనూ అతడు ప్రత్యేకంగా నిలిచాడు. మొత్తం 14 మ్యాచుల్లో 59.25 సగటు, 149.53 స్ట్రైక్‌రేట్‌తో 474 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు బాదేశాడు. 31 బౌండరీలు, 29 సిక్సర్లు దంచికొట్టాడు. ఇక 2022లో 7 మ్యాచుల్లో 174 కొట్టాడు. అయితే అంతకు ముందు మూడు సీజన్లలో నిరాశపరిచాడు. మొత్తానికి అతడి కష్టానికి ప్రతిఫలం లభించింది. ఐర్లాండ్ టూర్‌కు ఎంపికయ్యాడు.
'ఇదో కలగా అనిపిస్తోంది. ఇప్పుడప్పుడే లేవాలని అనిపించడం లేదు. ఇదో అద్భుతమైన ఫీలింగ్. మాటల్లో వర్ణించలేను. అసలు ఏమీ లేని స్థితి నుంచి ఇక్కడికి చేరుకున్నాను. నేను ఎక్కువ భావోద్వేగానికి గురవుతాను. అందుకే మా అమ్మానాన్నతో మాట్లాడినప్పుడల్లా మేమంతా ఏడుస్తూనే ఉంటాం' అని రింకూ సింగ్ అన్నాడు. 'ఆరేళ్ల నుంచి కోల్‌కతా నైట్‌రైడర్‌కు ఆడుతున్నాను. మొదట్లో అవకాశాలు వచ్చినా విఫలమయ్యాను. జట్టులో చేరినప్పటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ముంబయిలోని కేకేఆర్ అకాడమీలో అభిషేక్ నాయర్ సర్ నేతృత్వంలో బ్యాటింగ్ మెరుగుపర్చుకున్నాను. ఆ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించింది' అని అతడు పేర్కొన్నాడు.
'నిరంతరం విఫలమవుతుంటే ఏ ఫ్రాంచైజీ ఉంచుకోదు. కానీ కేకేఆర్ (KKR) టీమ్ మేనేజ్‌మెంట్, అభిషేక్ సర్ నన్ను గుర్తించారు. నాలో నాకే తెలియని ప్రతిభను తట్టిలేపారు. నెట్స్‌లో రోజూ ఐదారు గంటలు బ్యాటింగ్ చేసి కొత్త షాట్లు నేర్చుకున్నాను. ఆ మూడేళ్లలో నేను ఆల్‌రౌండ్ బ్యాటర్‌గా మారాను. ఐపీఎల్‌లో రాణించాను. గుర్తింపు పొందాను. ఇప్పుడు టీమ్‌ఇండియా పిలుపుతో రివార్డు వచ్చింది' అని రింకూ చెప్పాడు. సెప్టెంబర్లో చైనాలో జరిగే ఏసియన్ గేమ్స్‌కు సైతం రింకూ ఎంపికవ్వడం గమనార్హం.
🗣️ 𝐋𝐢𝐟𝐞 𝐜𝐡𝐚𝐧𝐠𝐞𝐝 𝐚 𝐥𝐨𝐭 𝐚𝐟𝐭𝐞𝐫 𝐈𝐏𝐋
— BCCI Domestic (@BCCIdomestic) July 30, 2023
Revisiting his iconic 5⃣ sixes off 5⃣ balls 💥
The joy of Asian Games call-up 👏
Feeling of being called 'Lord' 😃
WATCH @rinkusingh235 talk about it all 🎥🔽 - By @jigsactin | #Deodhartrophy https://t.co/Tx8P37sqqC pic.twitter.com/qU8dyitoTI
వచ్చే నెలలో ఐర్లాండ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియాను ప్రకటించారు. జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. అంతే కాదు జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఐర్లాండ్ పర్యటనకు యువ ఆటగాళ్లను మాత్రమే పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐర్లాండ్ పర్యటనకు రుతురాజ్ గైక్వాడ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జడేజా, సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లాంటి ఆటగాళ్లకు ఈ విశ్రాంతి లభించనుంది.
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు
జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్, జితేష్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రముఖ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.