IND vs IER T20: భువీ రికార్డుకు ఎసరు పెట్టిన బుమ్రా! కమ్‌బ్యాక్‌లో రేర్ ఫీట్!
IND vs IER T20: టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 10 మెయిడిన్ ఓవర్లు విసిరిన రెండో ఆటగాడిగా ఆవిర్భవించాడు.
IND vs IER T20:
టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 10 మెయిడిన్ ఓవర్లు విసిరిన రెండో ఆటగాడిగా ఆవిర్భవించాడు. సహచరుడు భువనేశ్వర్ కుమార్ పది మెయిడిన్ ఓవర్ల రికార్డును సమం చేశాడు. గాయంతో సుదీర్ఘ కాలం దూరమైన అతడు ఐర్లాండ్ సిరీసులో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.
ఐర్లాండ్‌తో రెండో టీ20లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టాడు. 3.75 ఎకానమీతో 15 పరుగులే ఇచ్చాడు. ఛేదనలో ఆఖరి ఓవర్ల ఆతిథ్య జట్టుకు 38 పరుగులు అవసరం. జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియాపై అదేమీ అంత సులభం కాదు. అయితే ఆఖరి ఓవర్‌ను బుమ్రా వేశాడు. మొదటి మూడు బంతుల్లో పరుగులేమీ ఇవ్వలేదు. చురకత్తుల్లాంటి యార్కర్లు సంధించాడు. నాలుగో బంతికి అడైర్ (23; 15 బంతుల్లో) ఔట్ చేశాడు. యార్కర్‌గా వేసిన ఐదో బంతికీ పరుగులేం రాలేదు. ఆఖరి బంతికి మాత్రం నాలుగు బైస్ వచ్చాయి. అవి బౌలర్ ఖాతాలో పడవు. దాంతో బుమ్రా ఖాతాలో మెయిడిన్ ఓవర్ పడింది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మెయిడిన్ ఓవర్లు వేయడం ఈజీ కాదు. ఉగాండకు చెందిన ఫ్రాంక్ సుబుంగా కెరీర్లో 16 ఓవర్లు మెయిడిన్ వేశాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, గులామ్ అహ్మది (జర్మనీ) ఉన్నారు. ఈ ముగ్గురూ పది ఓవర్లు మెయిడిన్ చేశారు. మరో ఎనిమిది మంది ఆటగాళ్లు ఆరు ఓవర్లు మెయిడిన్లు విసిరారు. తాజా మ్యాచుతో భువీ రికార్డును బుమ్రా సమం చేశాడు.
ఐర్లాండ్‌పై టీ20 సిరీస్ గెలిచినందుకు సంతోషంగా ఉందని బుమ్రా అంటున్నాడు. 'చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కాస్త పొడిగా ఉంది. ఆట కొనసాగే కొద్దీ వికెట్ మరింత నెమ్మదిస్తుందని అనుకున్నాం. అందుకే మొదట బ్యాటింగ్ చేశాం. తుది జట్టును ఎంపిక చేయడం చాలా కష్టంగా ఉంది. అయితే ఇలాంటి తలనొప్పి మంచిదే. అందరూ ఆకలితో ఉన్నారు. రాణించాలన్న కసితో కనిపిస్తున్నారు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మేమంతా టీమ్‌ఇండియాకు ఆడాలని గట్టిగా కోరుకుంటున్నాం. ఏదేమైనా చోటు దక్కాలంటే శక్తికి మించి కష్టపడాల్సిందే' అని బుమ్రా అన్నాడు.
'అంచనాల బరువును మోస్తుంటే ఒత్తిడికి లోనవుతాం. అందుకే వీటిని పక్కన పెట్టేయాలి. ఎక్కువ అంచనాలతో బరిలోకి దిగితే 100 శాతం ఆడలేం. ఆటకు న్యాయం చేయలేం' అని బుమ్రా వెల్లడించాడు.
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘనవిజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు సాధించింది. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 33 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను కూడా 2-0తో సొంతం చేసుకుంది.
టీమిండియా బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (58: 43 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ సెంచరీ సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ (40: 26 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), రింకూ సింగ్ (38: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించారు. ఐర్లాండ్ బ్యాటర్లలో ఆండ్రూ బాల్‌బిర్నీ (72: 51 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు.