IND Vs ENG 2nd ODI Highlights: అదరగొట్టిన భారత బౌలర్లు - ఇంగ్లండ్ ఎంతకు ఆలౌట్ అయిందంటే?
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది.
టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ తడబడింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. మొయిన్ అలీ (47: 64 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ విజయానికి 50 ఓవర్లలో 247 పరుగులు కావాలి.
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ వరకు సాఫీగానే సాగింది. ఓపెనర్ జేసన్ రాయ్‌ను (23: 33 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) అవుట్ చేసి హార్దిక్ పాండ్యా టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ వికెట్లను తీసే బాధ్యతను స్పిన్నర్ చాహల్ తీసుకున్నాడు. కీలకమైన జానీ బెయిర్‌స్టో (38: 38 బంతుల్లో, ఆరు ఫోర్లు), జో రూట్ (11: 21 బంతుల్లో), బెన్ స్టోక్స్‌ల (21: 23 బంతుల్లో, మూడు ఫోర్లు) వికెట్లను చాహల్ తీసుకోగా... డేంజరస్ బట్లర్‌ను (4: 5 బంతుల్లో) షమీ అవుట్ చేశాడు. ఈ నాలుగు వికెట్లు ఏడు ఓవర్ల వ్యవధిలోనే పడ్డాయి. సగం జట్టు ఇంటి బాట పట్టేసరికి ఇంగ్లండ్ స్కోరు 102 పరుగులు మాత్రమే.
అయితే ఇక్కడ ఇంగ్లండ్ రెండు కీలక భాగస్వామ్యాలను ఏర్పరిచింది. ఆరో వికెట్‌కు లివింగ్‌స్టోన్ (33: 33 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), మొయిన్ అలీ 46 పరుగులు జోడించారు. లివింగ్‌స్టోన్ అవుటయ్యాక డేవిడ్ విల్లేతో (41: 49 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) కలిసి మొయిన్ అలీ ఏడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కాస్త కుదుటపడింది. అయితే లోయర్ ఆర్డర్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోవడంతో ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో చాహల్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి, మహ్మద్ షమీ, ప్రసీద్ కృష్ణ చెరో వికెట్ తీసుకున్నారు.
View this post on Instagram