India vs Bangladesh Highlights, 2nd T20I: భారత(India) జోరు ముందు బంగ్లాదేశ్(Bangladesh) నిలవలేకపోయింది. టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి బంగ్లా పులులను మట్టికరిపించిన టీమిండియా... ఇప్పుడు టీ 20 సిరీస్‌ను కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఇప్పటికే తొలి టీ 20(T20) ను కైవసం చేసుకున్న భారత జట్టు... ఇప్పుడు రెండో టీ 20లోనూ ఘన విజయం సాధించింది. మూడు టీ 20ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలిన ఉండగానే 2 -0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ స్కోరు చూసి సగం ఓడిపోయిన బంగ్లాదేశ్.. బరిలోకి దిగాక పూర్తిగా చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటికి కేవలం 135 పరుగులకే పరిమితమైంది. దీంతో 86 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
భారత బ్యాటర్ల ఊచకోత
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అది ఎంత తప్పుడు నిర్ణయమో బంగ్లాకు అర్థమైంది. ఆరంభంలో బంగ్లా బౌలర్లు బాగానే రాణించారు. సంజు శాంసన్ 10, అభిషేక్ శర్మ 15, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar yadav) 8 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. దీంతో భారత జట్టు 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో నితీశ్‌కుమార్ రెడ్డి(Nitish Kumar), రింకూసింగ్(Rinku singh) బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నితీశ్‌కుమార్ రెడ్డి బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. 34 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన నితీశ్.. క్రీజులో కాస్త కుదురుకున్నాక మరింత ధాటిగా ఆడాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాదేశాడు. మరోవైపు రింకూ సింగ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి చేసిన రింకూ.. 29 బంతుల్లో అయిదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 53 పరుగులు చేసి అవుటయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా కూడా మరోసారి బ్యాటు ఝళిపించాడు. 19 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు చేసింది. చివర్లో భారత బ్యాటర్లు వెంటవెంటనే అవుట్ కావడంతో స్కోరు వేగం కాస్త మందగించింది. లేకపోతే భారత స్కోరు ఇంకా పెరిగి ఉండేది.
పోరాటం చేయకుండానే
230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.... ఏ దశలోనూ టీమిండియాకు పోరాటం ఇవ్వలేదు. భారత బౌలర్లు రాణించడంతో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 135 పరుగులకే పరిమితమైంది. దీంతో 86 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో రాణించిన నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లోనూ మెరిశాడు. నాలుగు ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మిగిలిన భారత బౌలర్లు కూడా రాణించడంతో బంగ్లా పరాజయం ఖాయమైంది. బంగ్లా బ్యాటర్లలో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మహ్మదుల్లా ఒక్కడే 41 పరుగులతో పర్వాలేదనిపించాడు.