Parthiv Patel - Steve Smith: ఇండోర్ టెస్టులో 'చీట్' చేసిన స్టీవ్‌స్మిత్ - ఆ లూప్‌హోల్‌ను నిస్సిగ్గుగా వాడేశారు!
IND vs AUS 3rd Test: క్రికెట్ నిబంధనల పుస్తకంలో లూప్ హోల్స్‌ను వినియోగించుకోవడంలో ఆస్ట్రేలియాను మించిన జట్టు ప్రపంచంలోనే మరోటి లేదు! తాజాగా ఇండోర్ టెస్టులోనూ కంగారూలు ఇలాంటి పనే చేశారు.
Parthiv Patel - Steve Smith:
క్రికెట్ నిబంధనల పుస్తకంలో లూప్ హోల్స్‌ను వినియోగించుకోవడంలో ఆస్ట్రేలియాను మించిన జట్టు ప్రపంచంలోనే మరోటి లేదు! స్లెడ్జింగ్ నుంచి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా నడచుకోవడం వరకు అన్నీ చేసేస్తారు. ఆసియా ఆటగాళ్లు మన్కడింగ్ చేస్తే నీతులు చెబుతారు! స్వయంగా అనైతికతకు పాల్పడితే తప్పేం కాదన్నట్టు బొంకుతారు! తాజాగా ఇండోర్ టెస్టులోనూ కంగారూలు ఇలాంటి పనే చేశారు. ఒక లూప్‌హోల్‌ను నిస్సిగ్గుగా ఉపయోగించుకున్నారు.
ఇండోర్ టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (Steve Smith), వికెట్ కీపర్ అలెక్స్ కేరీ ఓ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. చాలాసార్లు బంతి అందుకోగానే కేరీ స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. ఫలితంగా డీఆర్‌ఎస్‌లు (DRS) కోల్పోకుండా చూసుకున్నారు! సాధారణంగా వికెట్ కీపర్ క్యాచ్ అందుకున్నాక డౌట్ ఉంటే డీఆర్‌ఎస్ తీసుకోవాలి. అందులో ఔటని తేలకపోతే సమీక్ష పోయినట్టే! దీన్నుంచి బయట పడేందుకు కేరీ క్యాచ్ అందుకోగానే బెయిల్స్‌ను ఎగరగొట్టాడు. ఇలాంటి పక్షంలో మూడో అంపైర్ మొదట క్యాచ్ అవుట్, తర్వాత స్టంపౌట్‌ను తనిఖీ చేస్తారు. ఒకవేళ బ్యాటర్ క్యాచౌట్ అయితే లక్కీగా వికెట్ దొరుకుతుంది. రివ్యూ తీసుకోలేదు కాబట్టి డబుల్ హ్యాపీ!
ఇదే విషయాన్ని టీమ్‌ఇండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ మీడియాకు వివరించాడు. 'నిబంధనల పుస్తకంలో ఓ లూప్‌హోల్ ఉంది. స్టంపింగ్ అప్పీల్ చేసినప్పుడు ఫీల్డ్ అంపైర్ మూడో అంపైర్‌ను సాయం కోరితే అన్నీ పరిశీలించాల్సి వస్తుంది. ముందుగా బ్యాటుకు బంతి తగిలిందో లేదో గమనిస్తారు. ఈ సంగతి తెలుసు కాబట్టే వాళ్లు నిస్సిగ్గుగా ఉపయోగించుకున్నారు. ఇందుకు రెండు పరిష్కారాలు ఉన్నాయి. ఫీల్డ్ అంపైర్‌కు బ్యాటర్ ఔట్ కాలేదన్న పూర్తి విశ్వాసం ఉంటే మూడో అంపైర్‌ను సంప్రదించొద్దు. లేదంటే టీవీ అంపైర్ కేవలం స్టంపౌట్ మాత్రమే పరిశీలించాలి. ఫీల్డింగ్ కెప్టెన్ డీఆర్‌ఎస్ తీసుకుంటే తప్ప క్యాచౌట్‌ను తనిఖీ చేయొద్దు. క్యాచౌటైనా, ఎల్బీ అయినా ఇలాగే చేయాలి' అని అన్నాడు.
IND vs AUS, 3rd Test:
నెర్రెలు వాసిన పిచ్! బంతిని గింగిరాలు తిప్పించే స్పిన్నర్లు! మైండ్ గేమ్ ఆడితే గెలవచ్చేమో అనే ఆశలు! ఇండోర్ టెస్టు మూడో రోజు ఆట మొదలయ్యేముందు టీమ్‌ఇండియా సిచ్యువేషన్ ఇదీ! కానీ అద్భుతమేమీ జరగలేదు. అసాధ్యం సుసాధ్యం అవ్వలేదు. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించేసింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించేసింది. ఆఖరి టెస్టుకు కొండంత ఆత్మవిశ్వాసం సాధించేసింది. ట్రావిస్ హెడ్ (49; 53 బంతుల్లో 6x4, 1x6), మార్నస్ లబుషేన్ (28; 58 బంతుల్లో 6x4) ఎలాంటి 'కంగారూ' లేకుండా ఆసీస్‌ను గెలిపించేశారు.
వికెట్లు పడలేదు!
మూడో రోజు, శుక్రవారం ఆసీస్ తాజాగా ఛేదనకు దిగింది. పరుగుల ఖాతా తెరవక ముందే ఉస్మాన్ ఖవాజా (0)ను అశ్విన్ ఔట్ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఎడమచేతి వాటం బ్యాటర్లను పదేపదే ఇబ్బంది పెట్టాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ కుదురుగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. టీమ్‌ఇండియా స్పిన్నర్లను ఆచితూచి ఎదుర్కొన్నాడు. పది ఓవర్ల తర్వాత వీరిద్దరూ దూకుడు పెంచారు. దొరికిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించి ఆత్మవిశ్వాసం సాధించారు. ఆపై నిర్భయంగా షాట్లు ఆడేసి 18.5 ఓవర్లకు ఆసీస్‌కు 9 వికెట్ల తేడాతో విజయం అందించారు. మరో 3 వికెట్లు పడుంటే ఆట రసవత్తరంగా ఉండేది.