R Ashwin: ప్రపంచకప్ ముందు ప్రయోగాలు - 20 నెలల తర్వాత వన్డే జట్టులోకి అశ్విన్ - ఇది దేనికి సంకేతం?
ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయాలు, చేస్తున్న ప్రయోగాలపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్ ముందు ప్రయోగాల ద్వారా సెలెక్టర్లు ఏం చెప్పదలుచుకున్నారు?
R Ashwin: వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత్ ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచకప్ సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇదివరకే వరల్డ్ కప్ కోసం ఎంపికైన జట్టును కాకుండా కొన్ని మార్పులు చేశారు సెలక్టర్లు. ఎవరూ ఊహించని విధంగా ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఎంపికచేయడం ఆశ్చర్యానికి గురిచేసేదే. అసలు వన్డే వరల్డ్ కప్ జట్టులో లేని ఆటగాడిని ఉన్నఫళంగా వన్డే సిరీస్‌కు ఎంపిక చేయడం ద్వారా సెలక్టర్లు ఏం చెప్పదలుచుకున్నారు..? 20 నెలలుగా వన్డేలు ఆడని ఒక ఆటగాడిని హఠాత్తుగా ఈ ఫార్మాట్‌లో అదీ కీలకమైన ప్రపంచకప్ ముందు ఆడించడం దేనికి సంకేతం..?
అశ్విన్ ప్రపంచకప్ ఆడతాడా..?
ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో అశ్విన్‌ను ఎంపికచేయడంపై బిన్నాభియప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వన్డే వరల్డ్ కప్‌కు ఇదివరకే ప్రకటించిన 15 మంది సభ్యులలో ఒకడిగా ఉన్న స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో అతడికి రెస్ట్ ఇచ్చారు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిశాక గాయపడ్డ అక్షర్.. కొలంబో నుంచి నేరుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నాడు. అతడు వన్డే వరల్డ్ కప్ వరకు కోలుకోవడం అనుమానమేనన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పిన్ ఆల్ రౌండర్ కోటాలో అశ్విన్‌కు ప్లేస్ దక్కినట్టు తెలుస్తున్నది.
అక్షర్ కోలుకోని పక్షంలో అప్పటికప్పుడు అశ్విన్‌ను సిద్ధం చేయడం కంటే ఇప్పట్నుంచే ప్రిపేర్ చేయడం బెటర్ అని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. అయితే అశ్విన్ చివరిసారిగా వన్డేలు ఆడింది 2022 జనవరిలో.. ఆ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పార్ల్ వేదికగా ముగిసిన వన్డేలో ఆడాడు. స మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో అశ్విన్ రెండు వన్డేలు ఆడి రెండు వికెట్లు తీశాడు. ఆ సిరీస్ కంటే ముందు అశ్విన్.. 2017 తర్వాత (ఐదు సంవత్సరాలకు) రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. టెస్టులు, టీ20లతో పోలిస్తే అశ్విన్‌కు వన్డేలలో గొప్ప రికార్డులు ఏమీ లేవు. ఇప్పటివరకూ 113 వన్డేలు ఆడిన అశ్విన్.. 151 వికెట్లు పనడగొట్టాడు. బ్యాటింగ్‌లో కూడా 63 ఇన్నింగ్స్‌లలో 707 పరుగులు చేశాడు. భారత్‌లో స్పిన్ కు అనుకూలించే పిచ్‌లపై అనుభవజ్ఞుడైన అశ్విన్ టీమిండియా విజయాలలో తోడ్పాటు అందించగలడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్.. తొలి మ్యాచ్ ఆడే చెన్నై పిచ్ స్పిన్‌కు స్వర్గధామం. అదీగాక అశ్విన్‌కు ఇది హోమ్‌గ్రౌండ్.
Rohit Sharma said - "With the kind of experience Ravi Ashwin has, close to 100 Tests, close to 150 ODIs and yes it is all in past but he has been consistently playing Test cricket and with guys like Ashwin having game time is not so much of a concern". pic.twitter.com/Lv4jEDZIya
— CricketMAN2 (@ImTanujSingh) September 18, 2023
అవసరమైతే ఆడిస్తాం..
అశ్విన్‌ను వన్డే వరల్డ్ కప్ ఆడించడంపై స్వయంగా భారత జట్టు సారథి రోహిత్ శర్మ ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చాడు. ‘అశ్విన్‌కు అపార అనుభవం ఉంది. నా ఉద్దేశంలో అశ్విన్ వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో ఉండాలి. అతడు కొన్నాళ్లుగా వన్డేలు ఆడలేకపోచవచ్చు గానీ అశ్విన్‌కు ఎంతో అనుభవం ఉంది. అవసరమైతే అశ్విన్‌ను వన్డే వరల్డ్ కప్‌లో ఆడిస్తాం. ఇదే విషయమై మేం ఇదివరకే అతడితో ఫోన్‌లో మాట్లాడాం..’ అని చెప్పిన విషయం మరువరానిది.. మరి కెప్టెన్ అన్నట్టు అక్షర్ కోలుకోకుంటే వరల్డ్ కప్ జట్టులో ఆష్ అన్న కూడా ఎంట్రీ ఇస్తాడన్నమాట..!
సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. 2017 తర్వాత వన్డే ఫార్మాట్‌లో అశ్విన్ ఆడిందేమీ లేకున్నా అతడిని తీసుకొచ్చి ప్రపంచకప్‌కు ముందు ప్రయోగాలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అక్షర్ గాయపడితే బ్యాకప్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకొచ్చినా బాగుండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.